15 April, 2026 | 6:04 AM

భాస్కరరావు ఔదార్యం

27-12-2025 12:00 AM

భాస్కరరావుగారు గుర్తుకు వచ్చినప్పుడల్లా వారు చేతితో నా గురించి రాసిన వ్యాక్యాలను చదువుకుంటాను. ఒక నిజాయితీ గల అధికారి ఎవరైనా భాస్కరరావు లాగా ఉండాలని నా మనస్సు నాకు ప్రబోధిస్తుంది. నాకు ఏ ఐ.ఏ.ఎస్ అధికారి తారసపడినా వెంటనే భాస్కరావుగారి ఔదార్యం గురించి ప్రస్తావించడం అలవాటైపోయింది. ఎంతైనా ఆదర్శం ఆదర్శమే కదా!

నా శిష్యుడు రాజ్‌గోపాల్ ఒకరోజు ఫోన్ చేసి ‘మీ ఇంటికి ఒక అరుదైన వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరు పి.భాస్కర్‌రావు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్. మీరింట్లోనే ఉంటారు కదా! అని చెప్పగానే నేను మరొక మాట ఏమీ చెప్పకుండానే రమ్మన్నాను. పి.భాస్కరరావు వృత్తి నిబద్ధత కలిగిన అధికారి. అతనికి ప్రజల మధ్య ఉండడం అన్నా, ప్రజల సమస్యలను తీర్చడమన్నా చాలా ఇష్టం.

చాలా మంది అధికారుల్లాగా ఆయన ఏ బంజారాహిల్స్‌లోనో, ఒక గొప్ప భవనంలోనో ఉండదగినవాడు. కాని అలా కాదని పదవీ విరమణ తర్వాత నాగోల్ దగ్గర్లోని అలకాపురిలో ఒక సామాన్యునిలాగా శేష జీవితం గడుపుతున్నాడు. రాజ్‌గోపాల్ నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి ఉంటాడు. ఆ మాటలు వారి మీద బాగా పనిచేసి ఉంటాయి. ‘చెన్నప్పగారికి సనాత న ధర్మం అంటే చాలా ఇష్టం. వేదార్థాన్ని, ఉపనిషత్తులను సరళమైన భాషలో మాకు బోధిస్తారు’ అని రాజ్ వారికి చెప్పగా ఒకరోజు స్వయంగా మా ఇంటికి రావడానికి వారు నిశ్చయించారు. 

నాకోసం శివపురాణం.. 

నిరాడంబరమైన దుస్తుల్లో పి. భాస్కరరావు కారులో మా ఇంటికి వచ్చాడు. ఒక ఐ.ఏ.ఎస్ అధికారి ఇంత సాధారణమైన వ్యక్తిగా ఉంటాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. భాస్కరరావు గారిని లోపలికి ఆహ్వా నించాను. వస్తూ వస్తూ వారు నాకోసం ‘శివపురాణం’ తీసుకొచ్చారు. అది గీతాప్రెస్ వారి ప్రచురణ. చాలా రోజుల నుండి ‘శివపురాణం’ చదవాలన్న కోరిక వారి ద్వా రా తీరుతున్నందుకు ఎంతో సంతోషించాను.

‘చెన్నప్పగారు!.. నేను ఒక పది మంది ముఖ్యమంత్రుల దగ్గర అధికారికా పనిచేశాను. నాకు పని చేయడమే తెలుసుగాని, అలసత్వం చూపినవాణ్ణి కాదు. ఇప్పుడు రిటైర్డ్ అయి ఇంట్లోనే ఉంటున్నా ను. మీ ‘బృహద్గీత’ను చదివిన తర్వాత మిమ్మల్ని చూడాలనిపించింది.’ అన్నారు. నిజమే 1997లో ముత్యాలసరాలలో ముద్రితమైన నా ‘బృహద్గీత’ను ఎవరైనా చదవవచ్చు. రాగయుక్తంగా గానం చేయవచ్చు. ‘బృహద్గీత’ అట్ట మీది నాలుగు పంక్తులు వారిని బాగా ఆకర్షించినాయట. వారి స్మృతి అద్భుతంగా ఉందని చెప్పడానికి ఉదాహరణగా ఆ నాలుగు పంక్తులను వారే స్వయంగా వినిపించడం విశేషం. 

‘కష్టపడుతూ బ్రతుకునొక్కడు

కష్టపెడుతూ బ్రతుకునొక్కడు

కష్టమెరుగక బ్రతుకునొక్కడు

విడిచి సర్వము బ్రతుకునొక్కడు’

ఇంటర్నెట్ ఉందా?

ఎలా జీవించినా చివరికి అన్నీ విడిచి పెట్టాల్సిందేనని బాగా చెప్పినారు. ఈ పం క్తులు నాకు బాగా నచ్చాయన్నారు. ఆ మాటలకు నేనెంతో సంతోషపడ్డాను. అకస్మాత్తుగా వారు ‘ఇంట్లో ఇంటర్‌నెట్ ఉందా?’ అని అడిగారు. చాలా రోజుల నుంచి నేను దాన్ని పెట్టించుకోవాలని అనుకున్నాను. కానీ ఆ పని చేయలేకపోయానని వినయంగా తెలియజేశాను.

ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ముచ్చటించి వారు వెళ్లిపోయారు. వారు మా ఇంటికి వచ్చినందుకు రాజ్‌గోపాల్ ద్వారా నా సంతోషాన్ని వెల్లడించాను కూడా. కానీ ఆ మర్నాడు.. ‘భాస్కర్‌రావుగారు పంపించారు. మీ ఇంట్లో ఇంటర్నెట్ పెట్టడానికి’ అని ఇద్దరు వ్యక్తులు మా ఇంటి గేటు ముందు నిలబడి పేర్కొన్నారు. నేను వారిని లోపలికి రమ్మన్నాను. వారు ఒక గంటలో పని పూర్తిచేసి వెళ్లిపోయారు. నేను భాస్కరరావుగారికి ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలియజేశాను. 

ప్రేమాభిమానం..

ఆ తర్వాత వారు అలకాపురిలో స్వ యంగా రెండు సమావేశాలను ఏర్పాటు చేసి నన్ను ఉపనిషత్తుల మీద మాట్లాడించారు. నిజానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని వారు ఆ రెండేసి కార్యక్రమాల్లో రెండు గంటలకు పైగా కూర్చోవడం విశే షం. ఆ సమావేశాల తర్వాత స్వగృహానికి పిలిచి నాకు నూతన వస్త్రాలను బహూకరించారు. మన ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, భాష పట్ల భాస్కరరావు గారికున్న ప్రేమాభిమానాలు నన్ను బాగా ఆకర్షించాయి.

అదే సందర్భంలో నేను రచించిన ‘వేదమాత’ శతకానికి ముందుమాట రాయమని కోరాను. వారు నా గురించి అందులో ‘చెన్నప్పగారు.. పండితుల్లో అరుదైన పండితులు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే గాక దేశ ప్రజలందరికీ ఆయనలాంటి వాళ్లు ఎంతో అవసరం.’ అన్న వ్యాక్యాలు నా రచనా వ్యాసంగానికి, ప్రసంగాలకు ఎంతో ప్రేరకంగా నిలిచాయి. 

విలపించిన క్షణాలు..

భాస్కరరావుగారితో అప్పడప్పుడు వేదాంత విషయాలనే ముచ్చటించేవాణ్ని. వారు భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం కలిగిన వారు. అటువంటి వారితో పరిచయం కలగడం అదృష్టమనే చెప్పుకోవా లి. ఇట్లుండగా నా విద్యార్థి రాజ్‌గోపాల్.. భాస్కర్‌రావుగారు దివంగతులైనారన్న వార్త నా చెవిలో పడేశారు. ఆ వార్త విని నేనెంతో విలపించాను. కొద్దికాలంలోనే వారితో ఏర్పడిన బంధం పురాకృతపుణ్యఫలంగా భావించాను.

వారి స్మృతికి అంకి తంగా ‘మాండూక్యోపనిషత్తు’ను వచనం లో రచించాను. కొన్ని ప్రతులు వారి ఇంట్లో ఇవ్వమని మా శిష్యుడిని కోరాను. నా మాట ప్రకారం అతడు వారికి ఆ ప్రతులను అందజేశారు. ఆ ప్రతుల్లో భాస్కరరా వుతో నేను దిగిన ఫోటోలున్నాయి. వారు ‘వేదమాత’కు నా గురించి రాసిన నాలుగు పంక్తులను కూడా జతపరిచాను. 

భాస్కరరావుగారు గుర్తుకు వచ్చినప్పుడల్లా వారు చేతితో నా గురించి రాసిన వ్యాక్యాలను చదువుకుంటాను. ఒక నిజాయితీ గల అధికారి ఎవరైనా భాస్కరరావు లాగా ఉండాలని నా మనస్సు నాకు ప్రబోధిస్తుంది. నాకు ఏ ఐ.ఏ.ఎస్ అధికారి తారసపడినా వెంటనే భాస్కరావుగారి ఔదార్యం గురించి ప్రస్తావించడం అలవాటైపోయింది. ఎంతై నా ఆదర్శం ఆదర్శమే కదా!

- వ్యాసకర్త సెల్: 9885654381