10 March, 2026 | 6:13 AM

పాక్ పరువు పాయే!

28-12-2025 12:00 AM

అక్రమ వలసదారులపై కఠిన చర్యల పేరుతో అన్ని దేశాల కంటే తామే ఎక్కువగా బహిష్కరణలు చేపట్టామని గొప్పగా చెప్పుకున్న అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది డొపోర్టేషన్ పేరుతో అత్యధిక బహిష్కరణలు చేపట్టిన దేశంగా సౌదీ అరేబియా మొదటి స్థానంలో నిలిచింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవలే రాజ్యసభకు సమర్పించిన నివేదిక ద్వారా విషయం బయటకు వచ్చింది. అయితే మన పొరుగుదేశం పాకిస్థాన్‌కు మాత్రం సౌదీ అరేబియా కోలుకోలేని దెబ్బను మిగిల్చింది. పాకిస్థాన్‌లో నిరుద్యోగం రేటు పెరిగిపోవడం, సరైన ఉపాధి లేక సౌదీకి వెళ్లి బిక్షాటన చేసుకుంటున్న పాక్ బిచ్చగాళ్లను తిరిగి స్వదేశానికి పంపడంతో అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోయినట్లయింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు కూడా పాక్ యాచక ముఠాలతో సతమతమవుతున్నాయి. అక్కడి ముఖ్యమైన స్థలాల్లో పాక్ జాతీయులు భిక్షాటన చేస్తూ విదేశీ టూరిస్టులను డబ్బుల కోసం వేధిస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు పాకిస్థాన్‌ను హెచ్చరించాయి. పర్యాటకం పేరుతో సౌదీకి వస్తున్న పాకిస్థానీయులు భిక్షాటన చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు దేశంలో బిచ్చగాళ్ల మాఫియా ఏ స్థాయిలో ఉందనే వివరాలను పాక్ ప్రభుత్వం బయటపెట్టింది.

బిచ్చగాళ్లు, క్రిమినల్ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉన్న వేల మందిని పాక్ ప్రభుత్వం నో-ఫ్లై లిస్టులో చేర్చింది. అవకాశాల్లేక విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన మరో 66 వేల మందిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నామని, ఈ ముఠాల వల్ల తాము అంతర్జాతీయంగా అప్రతిష్ఠను మూటకట్టుకోవాల్సి వస్తోందని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేర్కొంది. యాత్రల పేరిట పశ్చిమాసియా దేశాలకు వెళ్లి అక్కడికి వచ్చే విదేశీయుల వద్ద భిక్షాటన చేస్తూ దేశం పరువు తీస్తున్నారని బాధపడింది. ఈ తీరుపై పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. ఫలితంగా వీసాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. దీనివల్ల సాధారణ పాక్ పౌరులుల వీసాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక భారత విదేశీ వ్యవహారాల శాఖ నివేధిక ప్రకారం 2025లో దాదాపు 24,600 మంది భారతీయులను 81 దేశాలు స్వదేశానికి పంపించినట్లు పేర్కొంది. సౌదీ అరేబియా 11 వేలకు పైగా భారతీ యులను వివిధ కారణాలతో వెనక్కి పంపగా.. అమెరికా 3,800 మందిని భారత్‌కు డిపోర్ట్ చేసిందని విదేశాంగ శాఖ తన నివేదికలో తెలిపింది. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల సంఖ్య పెరిగిపోవడం, అక్కడి కఠినమైన వలస, కార్మిక నిబంధనలు దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది వివిధ దేశాల నుంచి భారతీయుల బహిష్కరణల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇకపై విదేశాలకు వెళ్లే కార్మికులు, విద్యార్థులకు వివిధ దేశాల వలస నిబంధనలపై స్పష్టమైన అవగాహన అవసరం. ఏ చిన్న తప్పిదం చేసినా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండడంతో మనవాళ్లు జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరముంది.