15 April, 2026 | 7:16 AM

న్యాయమెప్పుడు?

26-12-2025 12:00 AM

ఉన్నావ్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలు రాసిన లేఖ ద్వారా ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలు స్తూ ఢిల్లీ ట్రయల్ కోర్టు కుల్దీప్ సింగ్ సెంగర్ సహా అతని ముగ్గురు అనుచరులకు జీవిత ఖైదు విధించింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ సెంగర్ శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేయడంతో ఉన్నావ్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది.

2017 ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలు బహిరంగ లేఖ రాసింది. జూన్ 4న రాత్రి 8 గంటలకు ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఉద్యోగం కోసం వచ్చిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత జూన్ 11న ఎమ్మెల్యే అనుచరులైన శుభమ్ సింగ్, బ్రిజేష్ యాదవ్, అవధ్ నారాయణ్‌లు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని లేఖలో పేర్కొంది.

అయితే కుల్దీప్ సింగ్ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత కుల్దీప్ సింగ్, అతని సోదరుడు కలిసి బాధితురాలి తండ్రిని నేరస్థుడిగా ఇరికించి అరెస్ట్ చేయించారు. అయితే కస్టడీలో ఉన్న సమయంలో బాధితురాలి తండ్రి మృతి చెందారు. దీంతో నిందితులపై ఎలాంటి చర్యలు లేవంటూ బాధితురాలు 2018 ఏప్రిల్ 8న సీఎం యోగి నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ విషయం దేశమంతటా పాకడంతో బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏప్రిల్ 13న అలహాబాద్ హైకోర్టు ఉన్నావ్ కేసును సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ కుల్దీప్ సింగ్, అతని అనుచరులను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత 2019 జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును రాయ్‌బరేలీ వద్ద ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఇది కుల్దీప్ చేయిం చిన హత్యాయత్నమని విచారణలో తేలడంతో సుప్రీంకోర్టు ఈ కేసును యూపీ నుంచి ఢిల్లీకి బదిలీ చేసింది.

ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 16, 2019న ఢిల్లీ ట్రయల్ కోర్టు కుల్దీప్‌ను దోషిగా తేలుస్తూ జీవిత ఖైదుతో పాటు, బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం కేసులోనూ మరో పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల జైలు జీవితం తర్వాత కుల్దీప్ సింగ్ తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, బెయిల్ పొందడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే బాధితురాలి నివాసానికి వెళ్లడం, బెదిరింపులకు పాల్పడడం చేస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది.

ఈ సందర్భంగా ప్రాణభయంతో గురువారం బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం, అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ సోనియా, రాహుల్‌ను ఆశ్రయించగా వారు అండగా ఉంటామన్నారు.

మరోవైపు సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్‌ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించిందన్న విమర్శలు పెరిగాయి. ఇక బాధితురాలితో పాటు సీబీఐ కూడా కుల్దీప్ సింగ్ బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీంతో మరోసారి ఈ కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టనుండడం తో బాధితురాలికి న్యాయం జరుగుతుందా అనేది చూడాలి.