15 April, 2026 | 7:16 AM

ప్రజా ఉద్యమమే జీవితంగా..

26-12-2025 12:00 AM

నాయకులు ఎక్కడో పుట్టరు. మనలో ఒకడిగా జన్మిస్తారని చెప్పడానికి నిదర్శనం కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్. మెదక్ జిల్లాలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై జమీందార్ల ఆగడాలకు అడ్డూ, అదుపు లేని సమయంలో ప్రజలను చైతన్యపరిచి అందరినీ సంఘటితం చేయడంలో ఆయన విజయవంతమయ్యారు. పేదవాళ్ల హక్కుల సాధనకై ప్రజా పోరాటాలు చేశారు. ఆయనకున్న ప్రజా బలంతో నిజాం సర్కార్‌ను కూడా గడగడలాడించారు.

భూపోరాటంలో భాగంగా ‘దున్నేవాడిదే భూమి’ అంటూ ముందుగా తన భూమిని పేదలకు పంచి, భూ స్వాములపై పోరాటాలు చేసి,ఆ భూములను లాక్కుని కులమతాలకతీతం గా పేద ప్రజలకు పంచి వారికి ఆరాధ్యదైవంగా మారిపోయారు. డిసెంబర్ 26.. కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతిఏటా జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుం ది.

గుడిలోని ప్రతిమకు పూజలు చే యడం, ఎద్దుల బండ్లతో గుడి చుట్టూ రా ప్రదర్శనలు చేయ డం, చిన్నపిల్లలకు తలనీలాలుతీసి కిష న్, కిషనమ్మ పేర్లను నామకరణం చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం, తురకల మందాపూర్ గ్రా మంలో ముదిరాజుకులానికి చెందిన కేవల్ నారాయణ, మున్నాభాయ్ దంపతులకు 1922, మే 10న కేవల్ కిషన్ జన్మించారు.

అప్పటికే వీరి కుటుంబం విద్య, ఆర్థికరంగాల్లో అగ్రగామిగా ఉండేది. భూస్వాముల కుటుంబానికి చెందిన కేవల్ కిషన్ ముది రాజ్ తన ఉన్నత విద్యాభ్యాసాన్ని మెదక్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ టాపర్‌గా నిలిచారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ ఉద్య మకారులతో ఏర్పడిన పరిచయం కేవల్ కిషన్‌ను ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. స్వాతంత్య్రానంతరం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కేవల్ కిషన్ కీలకపాత్ర పోషించారు.

పేదలకు భూములు పంచిపెట్టడమే కాకుండా అనేక పోరాటాలు చేయడం, అందులో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో కేవల్ కిషన్ ముందుండేవారు. దీంతో అప్పటి పాలకులకు కేవల్ కిషన్ శత్రువుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో కామ్రేడ్ కేవల్ కిషన్ 1960 డిసెంబర్ 26న మాసాయిపేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించి, తన సహచరుడు లక్ష్మయ్యతో కలిసి బైక్‌పై మెదక్ వస్తుండగా, మెదక్ ప్రధాన రహదారి పొలంపల్లి చౌరస్తాలో లారీతో ఢీకొట్టి హత్యచేయించినట్లు అక్కడి ప్రజల్లో భావన ఉండేది.

పేద ప్రజల హక్కుల కోసం పోరాడు తూ అసువుల బాసిన కేవల్ కిషన్ జ్ఞాపకార్థం పొలంపల్లి చౌరస్తాలో ఆయనకు సతీసమేతంగా ఒక గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిఏటా ఆయ న వర్ధంతి రోజున పొలంపల్లి చౌరస్తా వద్ద జాతర నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. కేవల్ కిషన్ చరిత్రను ఉద్యమపాటలుగా, జానపద పాటలుగా మలిచి అక్కడి ప్రజలు పాడడం ఆయన గొప్పతనాన్ని చాటిచెబుతుంది.

పేద ప్రజల హక్కుల సాధనకై అసువులు బాసిన కేవల్ కిషన్ సేవలను ప్రభుత్వం గుర్తించాలి. ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా విద్యార్థులకు కేవల్ కిషన్ జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి.

 పోలం సైదులు, 9441930361