ఇస్రో పయనమెటు?

09-09-2026 | 05:10am

మూడేళ్ల క్రితం తెచ్చిన భారతీయ రోదసీ విధానం(Indian Space Policy) ఇస్రోలోని(Indian Space Research Organisation) ఉద్యోగులకు ఆందోళనకరంగా మారింది. భారత అంతరిక్ష రంగం(India space sector)లో అంతకు మూడేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు(Central Government Reforms) ప్రారంభించింది. సైకిల్‌పై రాకెట్‌ను మోసుకెళ్లి దశాబ్దాలుగా అంతరిక్ష పరిశోధక రంగంపై తనదైన ముద్రవేసిన ఇస్రో క్రమంగా ప్రైవేటు బాట పడుతుందేమోనన్న భయాలు కొంతకాలంగా ఆ సంస్థ ఉద్యోగులను వేధిస్తోంది. అందుకే సిబ్బంది క్రమంగా సంస్థను వీడడం మొదలైంది. 2019లో ఇస్రోలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు వుండేవారు.

2025 కల్లా వారి సంఖ్య దాదాపు 15 వేలకు తగ్గింది. మరోవైపు అనేక ప్రైవేటు కంపెనీలు(Private companies) అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళుతున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace), అగ్నికూల్ కాస్మోస్ కంపెనీలు(Agnikul Cosmos companies) ఉపగ్రహ వాహక నౌకలను(Satellite carriers) తయారుచేస్తూ ముందుకెళుతున్నాయి. పిక్సెల్, ధ్రువ స్పేస్, గెలాక్స్ ఐ కంపెనీలు ఏకంగా ఉపగ్రహాలను తయారుచేస్తున్నాయి. ఈ రంగంలో స్టార్టప్‌లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. వాటికి రానున్న రోజుల్లో నైపుణ్యమున్న ఉద్యోగులూ అవసరమవుతారు.

ఈ పరిస్థితుల్లో ఇస్రో ప్రైవేటీకరణపై అనుమానాలను నివృత్తం చేస్తూ, ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థగానే వుంటుందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ స్పష్టంగా చెప్పడం ముదావహం. అసలు ఇస్రో భవిష్యత్ దీర్ఘకాలిక విధానమేమిటని సంస్థ ఉద్యోగులు కొంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ ప్రకటన కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. నాసా స్ఫూర్తితో భారత అంతరిక్ష పరిశోధనలో ఎన్నో ప్రశంసలు అందుకున్న ఇస్రో తన మౌళిక విధానానికి దూరమవుతున్నదనే ఆరోపణ ఉంది.

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక అభివృద్ధికి జతచేయాలనే లక్ష్యాన్ని వీడి, పరుగు పందెంలా వ్యవహరిస్తున్నట్లుగా సంస్థ రూపొందుతూ వచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో ఇప్పటికే ప్రైవేటు సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకొంది. ఉపగ్రహాలు పంపించే డేటాపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్న విదేశీ కంపెనీల బాటన ఇస్రో వెళ్లడం, సంస్థ ఉన్నత లక్ష్యాలను దెబ్బతీస్తున్నదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

విదేశీ ప్రయోగాలను తక్కువ ధరకే నిర్వహించి సంపాదనలో దూసుకెళ్లడమే సంస్థ ధ్యేయంగా మారిందనే విమర్శ కూడా వుంది. అందరు వెళ్లే బాటలోనే ఇస్రోను కూడా నడిపిస్తే, విదేశీ పెట్టుబడులు అందే సంస్థల సరసన ఇస్రో తట్టుకొని నిలబడగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ఇస్రో తన దీర్ఘకాల లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలని సిబ్బంది కోరుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు