ఉద్యోగ భద్రత ఏదీ?

11-09-2026 | 05:30am
  1. చాలీచాలని వేతనాలతో సతమతం
  2. 8 సంవత్సరాల సేవా కాలం నిరుపయోగమేనా?

మానకొండూరు, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): చాలీచాలని వేతనాలు, సమయపాలన లేని పనివేళలు, 8 సంవత్సరాలుగా సేవలందించినా, నేటికిని కనిపించని ఉద్యోగ భద్రతతో భూభారతి ఆపరేటర్లు (Bhu-Bharati Operators) మనోవేదనకు గురవుతున్నారు.

‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు’  కొందర్ని తొలగిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేసి, వారి స్థానంలో రెవెన్యూ శాఖలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి బాధ్యతలు అప్పచెప్పే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు వెలువడుతున్న వార్తల నేపథ్యంలో భూ భారతి ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఐదు నెలల జీతాలు పెండింగ్ ఉండటం తో పాటు, ఉద్యోగ భరోసా లేమి తో ఆపరేటర్లు మానసికంగా కుంగిపోతున్నారు.

రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న మండలాల ఆపరేటర్లను తొ లగించాలని, వారి స్థానంలో రెవెన్యూ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం యో చనలో ఉన్నట్టు తెలిసి, బతుకు భరోసా పై ఆపరేటర్లు బెంబేలెత్తుతున్నారు. రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న మండలాల సాకు చూపి భూభారతి  ఆపరేటర్లు ను అందర్నీ తొలగిస్తారా అనే అంశం నేటి వరకు స్పష్టత రాలేదు.

రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఏదైనా రిజిస్ట్రేషన్ ల  లో లావాదేవీలు జరిగితే ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న భూభారతి ఆపరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకునే వెసులు బాటు లేకపోవడం, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడంతో బాధ్యతగా విధులు నిర్వహించరనే సంశయంతో, ప్రభుత్వ ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి విధులను అప్పగించనున్నట్లు, దీనికి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఉన్నఫళంగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తే మా పరిస్థితి ఏమిటని భూభారతి ఆపరేటర్లు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 636 భూ భారతి ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తుండగా,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోకరీంనగర్ 18,  జగిత్యాల 22, పెద్దపల్లి 14, రాజన్న సిరిసిల్ల 13మంది మొత్తంగా 67 మంది భూ భారతి ఆపరేటర్లు గా విధులు నిర్వహిస్తున్నారు.

2018 సంవత్సరంలో వీరి సేవా కాలం ప్రారంభమై నేటి వరకు సుమారుగా 8 సంవత్సరాలనుండి చాలీ చాలని జీతాలతో జీవన గమనం సాగిస్తున్నారు.9,000 వేల రూపాయల వేతనంతో ప్రారంభమైన ఉద్యోగ ప్రస్థానం, తర్వాత 11,583 రూపాయలు, 20 24 సంవత్సరం వరకు, నాటి నుండి నేటి వరకు 17,404 రూపాయల వేతనం ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే (19 జిల్లాల లో) నిర్మల్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి తదితర జిల్లాలలో భూభారతి ఆపరేటర్లు తొలగిస్తూ వారి లాగిన్, యూజర్ ఐడిని పక్కన పెట్టారు.

భూ భారతి ఆపరేటర్ల సేవలు గుర్తించి కరీంనగర్ కలెక్టర్ భూ భారతి ఆపరేటర్లను ఏ ఒక్కరిని తొలగించవద్దని సిసిఎల్‌ఏ    నివేదిక పంపించినప్పటికీని, ఉన్నతధికారుల ద్వారా ఎటువంటి సానుకూలమైన ప్రకటన నేటి వరకు వెలువడ లేదు.

భూ భారతి ఆపరేటర్లు సెలవులు సైతం లెక్క చేయకుండా, రాత్రింబవళ్లు భూ భారతి పనులే కాకుండా ఎలక్షన్ వర్క్ , మార్కెట్ వాల్యూ పెంచినపుడు,  22A నిషేధిత భూముల విషయంలో ఉన్నతాధికారులకు సమర్థవంతంగా వారి సేవలను అందించారనటంలో సందేహం లేదు.   

ఇబ్బందులు పడుతున్నాం..

ఇప్పటికే ఐదు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి . ఉన్నఫళంగా మమ్మల్ని తీసేయడం మా కుటుంబాలని రోడ్డున పడేయడమే. ఈ ఉద్యోగాన్నే నమ్ముకొని మా కుటుంబాల్ని పోషించుకుంటున్నాం.పిల్లల చదువులకు, ఇంటి అద్దెలకు  ఇంట్లో తల్లిదండ్రుల పోషణకు  ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పునరాలోచించి, మేము ఇన్ని రోజులు చేసిన సర్వీసును చూసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.

 బోనాల సంపత్, కరీంనగర్ అర్బన్ ఆపరేటర్

మరిన్ని వార్తలు