26 July, 2026 | 3:15 PM

ఇదెక్కడి న్యాయం!

27-06-2024 12:05 AM

ఉద్యమమంటే మన కోసం మనం బతకడం కాదు. మన కదలిక, మన ఉనికి, మన నడవడికతో లక్షలాది మందిని నడిపిస్తూ వారందరి జీవితాలకు భరోసాను కల్పించడమే నాయకుడి అంతిమ లక్ష్యం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వకీల్ భీమయ్య అంటే తెలియని వారుండరు. దేశంలో జరిగిన మూడు పోరాటాలకు ప్రత్యేక్ష సాక్షి. ఒకటి స్వాతంత్య్ర ఉద్యమం, రెండోది తెలంగాణ తొలి దశ ఉద్యమం, మూడోది తెలంగాణ మలిదశ ఉద్యమం అని చెప్పొచ్చు. 96 ఏళ్ల వయసులో నేటికీ పెన్ను పట్టి కాగితంపై రాస్తాడు. నాడు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం అనుభవాలతోపాటు స్వరాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని సునాయాసంగా విజయక్రాంతితో పంచుకున్నారు. 

మహబూబ్ అలీఖాన్ సంస్థానంగా ఉన్న ప్రస్తుత మహబూబ్‌నగర్.. ఆనాటి నుంచి నేటివరకూ ఉద్యమాలను తన ఊపిరిగా చేసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణం గా గుర్తు పెట్టుకుని స్వాతంత్య్ర ఉద్యమం మొద లు కొని తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు వకీల్ భీమయ్య. ఇన్ని ఉద్యమాల తర్వాత సాధించిన స్వరాష్ట్రం లో అశించిన మేర అభివృద్ధికి దూరంగా తెలంగాణ ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

కుటుంబ నేపథ్యం..

నా పేరు వకీల్ భీమయ్య. నాటి నుంచి నేటి వరకు వకీల్ భీమయ్య అంటే అందరికీ తెలుసు. నేను 1928 మార్చి 3న జన్మించాను. నా విద్యాభ్యాసం మహబూబ్‌నగర్‌లోనే ప్రారంభమైంది. ఆ కాలంలో మేమంతా మహబూబ్ అలీఖాన్ ఆస్థానంలో చదువుకునేటోళ్ళం. నాల్గో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉర్దూలోనే చదువు సాగింది. నాకు నలుగురు అబ్బాయిలు. అందరూ హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం నేను నా భార్య వెంకటమ్మతో కలిసి మహబూబ్‌నగర్‌లోనే జీవనం సాగిస్తున్నాం. 

ఉద్యమమే ఊపిరిగా..

నా బాల్యంలోనే స్వతంత్ర సాధన కోసం మహనీయులు అందరూ కొట్లాడుతుండ్రు. అప్పుడే నాతో పాటు నా మిత్రులు అందరం కలిసి స్వతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనాలి అనుకున్నాం. అందుకు తగ్గట్టుగా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ లాఠీ దెబ్బలు తింటూ ఉద్యమంలో పాల్గొన్నాం. మన దేశానికి స్వాతంత్య్రం వస్తే కలిగే ప్రయోజనాలు గురించి ప్రచారం చేసుడే మా పని. అదొక మహా ఉద్యమమని చాలామందికి తెలియదు. నిత్యం ప్రజలను చైతన్యపరుచుకుంటూ ఉద్యమం చేసేటోళ్లం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అయింది. నా బాల్యం నుంచే ఉద్యమం చేయాలనే తపన నాలో చాలా ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా మన హైదరాబాద్‌కు రాలేదు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.

అప్పుడు జరుగుతున్న ఉద్యోగ నియమకాలను పరిశీలించి చూస్తే ప్రతి ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ వారికే వస్తున్నాయి. మన బిడ్డలకు వస్తలేవు. నీళ్లు, నిధులన్నీ ఆంధ్ర ప్రాంతానికే తీసుకుపోతుండ్రు. ఇలా అయితే మన ప్రాంతం ఎప్పుడు బాగుపడుతుందని, 1952లో మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమం ప్రారంభమైంది. దాంట్లో కూడా నేను, మా స్నేహితులం పాల్గొన్నాం. కాలక్రామేణ 1969లో ఈ ఉద్య మం మరింత ఉధృతమైంది. అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాలేదు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితం కారణంగా స్వరాష్ట్రం కల సిద్ధించింది. పది మందికి మంచి జరిగితే చాలు అనుకునే వాడిని కాబట్టి ఎలాంటి ఆస్తులు వెనకేసుకోలేదు. ఉద్యమ సమయంలో మన తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే తపన మాత్రమే ప్రతి క్షణం ఉండేది. ఇప్పటికీ నాకు తోచిన సహాయం చేస్తూనే ఉంటాను. 

నా శక్తి మేరకు చేశా..

నేను వకీల్ చదువు చదివినా. నన్ను వకీల్ భీమయ్య అంటేనే పాలమూరులో గుర్తు పడుతారు. నేను ఎవరి దగ్గర నాకు డబ్బులు కావా లి.. మీకు న్యాయం జరిపిస్తా.. అంటూ ఎప్పుడు చెప్పలేదు. ఎవరు నా దగ్గరకు వచ్చినా మీకు తోచితేనే ఇవ్వండి.. లేకుంటే లేదు అనేవాణ్ని. అందుకే గింత చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నా. నా జీవితమంతా ప్రజాసేవకు అంకితం చేశా. ఉద్యమం ఉద్యమం అంటూ నిత్యం తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచా. అది నాకు ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశ పడలేదు. ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేసిన సమయంలో మహబూబ్‌నగర్ నుంచి నన్ను నిలబడాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాగా అక్కడ పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఇక్కడికి వచ్చి నేను పోటీ చేస్తాను. అక్కడ ఇందిరాగాంధీ పోటీ చేస్తున్నారని చెప్పిండు. మేమంతా అతనికే సపోర్టు చేశాం. ఎప్పుడూ నాకు పదవులు కావాలి అని అనుకోలేదు. ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకుని బతికాం. నా శక్తి మేరకు న్యాయంగా బతికిన. నాకున్న దాంట్లో తోచిన సహాయం చేశా.

ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాలే.. 

స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సమయంలో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రమే ఉండేది. అప్పుడు మేమంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడ్డాం. స్వరాష్ట్రం కోసం ఎప్పుడు అయితే ఉద్యమం చేయాలని సంకల్పించామో.. అప్పటి నుంచి కొంత మేరకు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాం. మాకు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రావాలని చేసిన పోరాటాలు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతు న్నాయి. 1980లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వాంతంత్య్ర సాధన కోసం పోరాటం చేసిన వారి వివరాలు తయారు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

‘స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’ అనే కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమంలో పాల్గొన్న వారందరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించాం. మొదటగా రూ.5 వేల లోపు పింఛన్ వస్తుండే. అది కొంత కొంత పెరిగి ఇప్పుడు రూ.30 వేల దాకా వస్తుంది. ఆ పింఛన్‌తోనే బతుకుబండిని నెట్టుకువస్తున్నాం. నేను 1964లో ఎంతో శ్రమించి జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టుకున్నాను. మా ఇంటి చుట్టూ కొంతమందికి వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా షాప్‌లు వేసి ఇచ్చారు. వారు కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో పాటు నాకు ఫ్రీడం ఫైటర్‌గా వస్తున్న పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఎలాంటి సహకారం చేయలేదు. 

మంచి చేయాలనే తపన

ఇతరులకు మంచి చేయాలనే తపన మనసులో ఉండాలి. అప్పుడు అందరికీ మంచి చేసేందుకు ముందుకు అడుగులు వేస్తాం. మనకే మంచి జరుగాలి. ఎవరు ఏమైపోతే మాకేం అనుకుంటే వారి జీవితం సార్థకం కాదు. తెలంగాణ సిద్ధించింది అనే పదం వినిపిస్తే ఎంతగానో సంబురపడ్డాను. కానీ అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన పదేళ్ల తెలంగాణలో సాధించుకున్నది ఏంది అని చూసుకుంటే దాని ఫలితం శూన్యం అని చెప్పొచ్చు. ప్రాజెక్టులు అవి, ఇవి అని చెప్పి ప్రజల సొమ్మును వృథా చేసింది ప్రభుత్వం.

పేదరికంలో ఉన్న తెలంగాణ ప్రజల జీవితం బాగుపడేది ఎట్లా? కేవలం పర్సెంటేజీల కోసమే ఈ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలను పెంచి నాయకులు బాగుపడుతున్నారు. సమాంతర న్యాయం అనేది పుట్టాలి. ఎప్పుడు ఏమి చేయాలో అదే చేయాలి. ప్రజల అందరి అభిప్రాయాలను గౌరవించాలి. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. ఎలాంటి పనులు చేయాలని ప్రజలను కూడా ప్రభుత్వాలు అడగాలి. ఎలా పడితే అలా ఖర్చులు చేస్తూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఇదెక్కడి న్యాయం.. అందరికీ ప్రతి పనిలో న్యాయం జరిగేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండాలి. 

మూడు ఉద్యమాలను చూశా..

నేను చాలా అదృష్టవంతుడిని. అప్పుడు స్వాతంత్య్ర సాధన కోసం ఉద్యమం చేస్తుంటే నా వంతు నేనున్నానంటూ దేశం కోసం ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో పాల్గొన్నాను. 1969లో తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేశాను. తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమంలో నా శక్తి మేరకు ఉద్యమానికి ఊపిరిని అందించాను. ఈ మూడు ఉద్యమాల ఫలితాలను కళ్లారా చూస్తున్నా. స్వాతంత్య్రం రావడం యావత్తు దేశ ప్రజల తలరాతను మార్చేసింది. కాగా తెలంగాణ సాధించుకున్న తరువాత కేవలం మాజీ సీఎం కేసీఆర్ తోపాటు వారి కుటుం బ సభ్యుల జీవితాలను మాత్రమే మార్చింది. ఎంతోమంది ప్రాణత్యాగ ఫలితమే తెలంగాణ. సాధించుకున్న తెలంగాణలో అమ రుల కుటుంబాలలో, నిరుద్యోగుల జీవితాలలో ఎలాంటి వెలుగులు రాకపాయే. గిట్లయితే తెలంగాణ సాధించుకున్నది కేవలం కేసీఆర్‌ను సంతోష పెట్టడానికా? ఇది ఒక్క మారు తెలంగాణ ప్రజలు గమనించుకోవా లి. ఎందుకు? ఎక్కడ? ఏమిటి? అనే పదాలకు అర్థాలు తెలుసుకుని ముందుకు సాగితే మన తెలంగాణ బంగారుమయం అయ్యేది. 

జిల్లెల రఘు, 

మహబూబ్‌నగర్, విజయక్రాంతి