ట్రిపుల్ ఆర్‌ను బీఆర్‌ఎస్ మరిచింది
- తాము అధికారంలోకి వచ్చాకే కదలిక
- హైదరాబాద్-విజయవాడ 6 లేన్ హైవేను.. రెండేళ్లలో పూర్తి చేస్తామని గడ్కరీ హామీ
- ఢిల్లీలో మీడియాతో ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): జాతీయ రహదారులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అతి తక్కువ నిధులు విడుదల అయ్యాయని, హైవేల నిర్మాణానికి అవసరమైన భూసేకరణతో పాటు ఇతర అంశాలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. 2016లో ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డుపై గత సర్కారు ఏమాత్రం దృష్టి పెట్టలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కదలిక వచ్చిందన్నారు. బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 షేరింగ్‌లో చేపట్టాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యంగా కోమటిరెడ్డి వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తమైన హైదరాబాద్ 6 లేన్ల హైవేను రెండేళ్లలో పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని అన్నారు. ఏపీ విభజన చట్టప్రకారం రెండు రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని కేంద్రమంత్రి వెల్లడించినట్లు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అన్ని వినతులపై గడ్కరీ ఎంతో సానుకూలగా స్పందించారని అన్నారు. ఉప్పల్ ఘట్‌కేసర్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం పట్ల తమ ప్రభుత్వానికి ఎంతో జవాబుదారీతనం ఉందని, అందుకే రాష్ట్ర మంత్రులంతా బృందంగా ఢిల్లీకి వచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.






