ఆసరవుతడనుకున్న కొడుకు అమరుడయ్యాడు!
చేతికొచ్చిన కొడుకు ఆసరవుతడనుకున్న.. మేమే పాడెపై కాటికి మోయాల్సి వచ్చింది.. ఇద్దరు పిల్లల్నే కండ్లనుకొని బతికిన. కానీ, నా పెద్ద కొడుకు ఇయ్యాళ లేడు. తెలంగాణ కోసం ఉరేసుకున్నడు.. ఎన్ని ఉంటే ఏం లాభం.. నా జీవితానికి భరోసా.. నా ప్రాణం అనుకునే కొడుకు మట్టి పాలేయే. ఇప్పుడు నేను నా చిన్నకొడుకు బతుకుతున్నం.. తెలంగాణ వస్తే అమరుల కుటుంబానికి ఆసరాగా ఉంటమన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. వానొస్తే.. బుర్ద బుర్ద అయ్యే ఇల్లు.. అప్పుల పాలైన జీవితం.. మా కర్మ ఇంతే అనుకుని బతుకుతున్నం అంటున్నది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని కోడుపర్తికి చెందిన తెలంగాణ అమరుడు జీ మల్లేశ్ తల్లీ మణెమ్మ. 2010 ఉద్యమ సమయంలో తన కొడుకు మల్లేశ్ చనిపోయిండని, ఇప్పటికైనా సర్కారు తెలంగాణ కోసం పాణం ఇడిచిన వాళ్లకు చెప్పినవి జేస్తే బాగుండని తన కష్టాలను విజయక్రాంతితో పంచుకున్నది.
తెలంగాణ వచ్చిన రెండేళ్లకు..
నాకు ఇద్దరు కుమారులు. పెద్దోడు మల్లేశ్, చిన్నోడు వేణుగోపాల్. నా పెద్ద బిడ్డ మల్లేశ్ ఎప్పుడు తెలంగాణ రావాలి రావాలి అంటు ఉద్యమంలో పాల్గొనేటోడు. బిడ్డ వస్తాది నువ్వు మంచిగా ఉండు.. ఊరికే తిరుగకు అనేదాన్ని. నా మాటలను పట్టించుకోలే.. ఎక్కడ తెలంగాణ లొల్లి జరిగిన అక్కడికి పోయి వచ్చేటోడు. ఎంతజెప్పిన వినలేదు. ఇక తెలంగాణ రాదేమో అనుకుని చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయిండు. అప్పటి నుంచి మా కష్టాలు ఎక్కువ అయినాయ్. చిన్న కొడుకు వేణుగోపాల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుల బాధలు ఎక్కువ అయినాయ్.. కూలీ నాలీ చేసుకుని బతుకుతున్నాం. ఎవరు పలకరించే దిక్కేలేకుండా పోయింది. మా బతుకు ఎవరికీ రావొద్దు అనుకుని ఎన్నోసార్లు ఏడ్చిన. ఎవరు కనికరించలేదు.. నా కర్మ గింత అనుకుంటు కాలం వెల్లదీస్త్తున్నా.
తెలంగాణ అప్పుడొస్తది.. గిప్పుడొస్తది అంటూ బయట లొల్లి జరుగుతుంది. తెలంగాణ వచ్చింది అని నా బిడ్డ చెప్పిండు. గప్పుడు అనుకున్న తెలంగాణ వచ్చింది.. నా బిడ్డ చూసేందుకు లేకపోయా అంటు ఏడ్చిన. నా బాధ చెప్పనికే రాదు. కూటికి గంజీకి లేకుండా బతుకుతున్నాం. తెలంగాణ వచ్చిదంటే గప్పుడు కొంత దైర్యం వచ్చింది. నా చిన్నోడు వేణుగోపాల్‌కు మిడ్జిల్ మండలంలో అటెండర్‌గా నౌకరి ఇచ్చిండ్రు. రూ.10 లక్షలు ఇచ్చిరు. గీ డబ్బులు నా ప్రాణం పోయినందుకు వచ్చినవి అని అన్ని డబ్బులతో అప్పులు తీర్చుకున్నాం. ఇల్లు కట్టుకుందామంటే డబ్బులు లేవు. తెలంగాణ వచ్చినంక ఐదెకరాల భూమి, పింఛన్ ఇస్తమని చెప్పిండ్రు. కానీ, ఇప్పటికి ఎవరు ఇయ్యలె. ఎవల్ని అడిగిన ఎవరు పట్టించుకోవట్లే. నా మొగుడు పాణం మంచిగలేక చచ్చిపోయిండు. అప్పటి నుంచి పింఛన్ కూడ ఇస్తలేరు. నా కొడుకు మల్లేశ్ చనిపోయినందుకు పింఛన్ అన్నారు. నా మొగుడు చనిపోయిన పింఛన్ కూడ ఇస్తలేరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలె. వర్షం పడితే ఇల్లంత బుర్ద బుర్ద అయితంది. ఇప్పటికైన ఇల్లు ఇస్తే ఎట్లయిన బతుకుతాం. జర్ర సర్కారు మాపై దయ చూపాలి.
చెప్పిందొక్కటి.. చేసిందొకటి..
మా అన్న మల్లేశ్ తెలంగాణ కోసం చనిపోయినందుకు నాకు ఉద్యోగం ఇచ్చిండ్రు. మా అన్న ఉంటే కచ్చితంగా జాబ్ వచ్చేది. చాలా మంచిగా చదువుకునే వాడు. నాకు ముందుగా మిడ్జిల్ మండలంలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చిండ్రు. 2021 డిసెంబర్‌లో జీవో నంబర్ 317 తెచ్చింది. నాది మహబూబ్‌నగర్. అయిన రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేసిండ్రు. నాకు మహబూబ్‌నగర్ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదు. ఇప్పుడు ఆమన్‌గల్‌లోని జూనియర్ కాలేజీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. అమ్మ ఊరు విడిచి రాను అంటోంది.. నేను ఆమన్‌గల్లుకు ట్రాన్స్‌ఫర్ చేసిండ్రు. ఊరిలో ఇల్లు బాగాలేదు.. నాకు వస్తున్న డబ్బులు బతకనీకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇల్లు, అమ్మకు పింఛన్ ఇస్తే బాగుం డు. మా అన్న చనిపోయినప్పుడు భూమి కూడ ఇస్తామని సర్కాక్ చెప్పింది. కానీ ఇవ్వలేదు. ఎవ ర్ని ఏమి అడుగాలో తెలియడం లేదు. సర్కారు మాకు సహాయం చేయాలని వేడుకుంటున్నాం.
వేణుగోపాల్,
అమరవీరుడు మల్లేశ్ తమ్ముడు






