16 April, 2026 | 2:08 AM

ట్రంప్‌పై వ్యతిరేకత!

16-04-2026 12:00 AM

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ ఆయన పట్టిందల్లా వివాదమే అవుతున్నది. ఇంటాబయటా ఆయన నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ‘అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ అగ్రరాజ్యం పగ్గాలు అందుకున్న ట్రంప్ ‘అమెరికాను గ్రేట్ చేయకపోయినా ఫర్వాలేదు, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలుకుబడి తగ్గించకపోతే చాలు!’ అనే పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై  ట్రంప్ ఉక్కుపాదం మోపారు.

ఆ తర్వాత ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగారు. మిత్రులు, శత్రువులన్న తేడా లేకుండా అందరిపై భారీగా టారిఫ్‌లు విధించారు. వీటిని అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టేయడంతో అమెరికా అధ్యక్షుడికి సొంత దేశంలో చుక్కెదురైంది. ఆ తర్వాత డ్రగ్ మాఫియాను నడుపుతున్నారన్న ఆరోపణలపై ఏకంగా వెనెజువెలా దేశాధినేతను రాత్రికిరాత్రి అరెస్టు చేశారు. అనంతరం పశ్చియాసియాలో పోరుకు ఆజ్యం పోశారు.

ఇరాన్‌ను రెండు వారాల్లోపు అదుపులోకి తీసుకుంటానని భావించిన ట్రంప్ ఎంతకీ పైచెయ్యి సాధించకపోవడం, రోజూ వేల కోట్ల రూపాయల నష్టం వస్తుండటంతో ఐదు రోజుల విరామాన్ని ప్రకటించారు. ఆ తర్వాత విజయం తమదేనని స్వయంగా ప్రకటించుకొని శాంతి చర్చలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధం చేయాలన్న ట్రంప్ నిర్ణయంపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పైకి వేరే కారణాలు చెప్తున్నప్పటికీ యుద్ధం వద్దని వారించినందుకే అటార్నీ జనరల్ పామ్ బొండిని, అంతకుముందు హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్టీ నోయిమ్‌ను పదవి నుంచి తప్పించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అంతేకాదు, ఇరాన్ యుద్ధాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చివరికి శాంతి చర్చలకు నాయకత్వం వహించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎడతెగని యుద్ధం వల్ల అమెరికాకు భారీగా నష్టం వాటిల్లుతున్నదని అమెరికన్లు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ‘నో కింగ్స్’ నిరసనలు వెల్లువెత్తిన విషయం విదితమే. 54 శాతం మంది అమెరికన్లు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇటీవల ఇప్సాస్ రాయిటర్స్ సర్వేలో వెల్లడవడం అందుకు నిదర్శనం. 24 శాతం ట్రంప్ చర్యను సమర్థించగా, 22 శాతం దీనిపై స్పందించడానికీ విముఖత చూపారట. అధికార రిపబ్లికన్ పార్టీలోనూ 46 శాతం మంది ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తేలడం గమనార్హం. సొంత ప్రజలే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇకపై అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారేమో వేచిచూడాలి.