15 April, 2026 | 7:21 AM

అసలు దోషులెవరు?

14-11-2025 12:00 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడైన సురేందర్ కోలీని నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తి కలిగించింది. నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన సురేందర్.. న్యాయవ్యవస్థలో ఆఖరి అస్త్రమైన క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం అతనికి ఊరటనిచ్చింది.

సురేందర్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక కత్తి ఆధారంగా సురేందర్‌ను నిందితుడిగా భావించలేమని, వెంటనే అతడిని విడుదల చేయాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కేసు విషయానికొస్తే.. 2006లో నొయిడాలోని నిఠారీ వద్ద మోనిందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. ఫండేర్‌తో పాటు అతని సహాయకుడు సురేందర్ కోలీని అరెస్టు చేసింది.

ఈ వ్యవహారంలో మొత్తం 19 కేసులుంటే మూడింటిలో సరైన ఆధారాలు లేకపోవడంతో వాటిని కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు రెండేళ్ల క్రితం మిగతా 16 కేసుల్లో పన్నెండింటిలో సురేందర్‌ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఇక ఫండేర్‌పై ఉన్న మూడు కేసుల్లోనూ అతడిని నిర్దోషిగా పేర్కొంది. అయితే 15 ఏళ్ల బాలిక హత్య కేసులో మాత్రం సురేందర్ దోషిగా తేలడంతో ఉరిశిక్ష పడి 20 ఏళ్లుగా జైళ్లో మగ్గిన అతడు బుధవారం బయటికి వచ్చాడు.

మరి అన్ని కేసుల్లోనూ సురేందర్ నిర్దోషిగా తేలితే వరుస హత్యల వెనుక అసలు దోషులెవరన్నది మిస్టరీగా మారింది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ.. యజమాని ఫండేర్ ఆదేశాల మేరకే కోలీ ఇదంతా చేశాడని ఒకసారి, ఆ తర్వాత ఫండేర్ ప్రమేయం లేకుండా సురేందర్ ఒక్కడే హత్యలన్నీ చేశాడని సీబీఐ ఆరోపించింది. చుట్టుపక్కల నిరుపేద పిల్లలను ఊరించి, బంగ్లాకు రప్పించి, అఘాయిత్యాలు, హత్య అనంతరం భవనం వెనుక ఉన్న కాలువలో మృతదేహాల విడిభాగాలు పడేశారని తెలిపింది. అయితే సురేందర్ నేరాన్ని ఒప్పుకునే విషయంలో విచారణల సందర్భంగా న్యాయస్థానాల భిన్న వైఖరి కేసును బలహీనపడేలా చేసింది.

నేరం చేశారని భావించి దిగువకోర్టు ఇరువురికీ మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఇదే కేసులో సెషన్స్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వీరికి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఆ తరువాత మళ్లీ అనూహ్య పరిణామాల వల్ల సురేందర్ ఉరి నిలిచిపోవడం.. దానిని జీవితఖైదుగా మారుస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సురేందర్, ఫండేర్‌లు నిందితులు కాదని తేల్చిన న్యాయస్థానాలు, కేసును తప్పుదోవపట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

నిఠారీ 19 వరుస హత్య కేసుల్లో సురేందర్, ఫండేర్‌లు నిర్దోషులని తేలినప్పుడు రెండు దశాబ్దాలుగా కేసు మొత్తం వారి చుట్టూనే తిప్పుతూ, విలువైన న్యాయస్థానాల సమయాన్ని ఎందుకు వృథా చేశారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆ ఇద్దరూ.. దోషులా, నిర్దోషులా అన్న సంగతి పక్కనబెడితే, అమాయకులైన పిల్లల ప్రాణాలు తీసి వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన అసలు దుర్గార్గులకు కఠిన శిక్ష పడాలని ఆశిద్దాం!