2 August, 2026 | 3:06 PM

బీర్కూర్ మంజీరా చెక్‌డ్యాం ఏర్పాటు క్రెడిట్ ఎవరిది..?

02-08-2026 02:04 PM

ఇరు పార్టీల పాలాభిషేకాల హోరు...అభివృద్ధి పనులపై వార్ జోరు...

అభివృద్ధి పనులపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల రాజకీయ వేడి...

బాన్సువాడ, ఆగస్టు 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్(Beerkur Manjeera check dam) మండలంలోని మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యాం ప్రారంభం, దాని నిర్మాణానికి సంబంధించిన రాజకీయ క్రెడిట్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెక్‌డ్యాం నిర్మాణం తమ నాయకుడు అంటూ ఒక పార్టీ వారు,మరోవైపు కాదు కాదు తమ నాయకుడు  కృషి ఫలితమేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా పాలాభిషేకాలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతోనే చెక్‌డ్యాం నిర్మాణం పూర్తై రైతులకు ఎంతగానో  ఉపయోగపడే స్థాయికి వచ్చిందని పేర్కొంటూ పాలాభిషేకం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం చెక్‌డ్యాంకు అవసరమైన నిధులు అప్పటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ నిర్మాణం సాధ్యమైందని చెబుతూ పాలాభిషేకం చేశారు.

అభివృద్ధి పనులకు సంబంధించి రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడడం కంటే, ప్రజలకు మేలు జరిగే విధంగా పరస్పర సహకారంతో పనిచేయడం అవసరమని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి కృషి చేస్తేనే శాశ్వత ఫలితాలు సాధ్యమవుతాయని వారు సూచిస్తున్నారు. మంజీరా చెక్‌డ్యాం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి వసతి మెరుగుపడే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల కంటే ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపైనే పాలకులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.