2 August, 2026 | 2:49 PM

ఖానాపూర్ ప్రధాన రహదారికి తాత్కాలిక మరమ్మతులు

02-08-2026 02:15 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారికి(Khanapur main road) శనివారం రాత్రి తాత్కాలిక మరమ్మతులు చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అంకం మౌనిక మహేందర్, షోయబ్ హుస్సేన్ లు పనులను పర్యవేక్షించారు .ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు పనుల క్రమంలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి కాగా రోడ్డుకిరువైపులా విస్తరణ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్నందున ఈ రోడ్డు దారుణంగా తయారై ,గుంతల మయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో తీర్మానం మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిసింది. కాగా మూడు జిల్లాల ప్రధాన కూడలి అయిన ఖానాపూర్ రహదారిని శాశ్వత మరమ్మతులు చేయాల్సి ఉండగా తాత్కాలిక పనులు ఏ మేరకు నిలుస్తాయోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.