l అడ్డంకిగా మారనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
l ఇంతవరకూ రాని పూర్తిస్థాయి షెడ్యూల్
l పరీక్షల షెడ్యూల్ మారే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూలైలో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు సాఫీగా జరుగుతాయా లేదా అన్న అనుమానాలు తలెత్తుతు న్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయంపై ఈనెల 11న జరిగిన భువనగిరి లోక్ సభ ఎన్నికల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిం దే. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం జనవరి 31న పూర్తికాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీల గడు వు జూలైలో ముగియనుంది.
జూలై తొలివా రం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్ మూడో వారం నుంచే ఎన్నికల ప్రక్రి య ప్రారంభించి ఒకే దఫాలో ఎన్నికలను పూర్తిచేసి పాలనపైన దృష్టిసారించాలని సీఎం యోచిస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలు జూలైలో జరగనున్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న ఆందోళన ఉద్యోగార్థుల్లో నెలకొన్నది.
సమగ్ర షెడ్యూల్ ఎప్పుడు..?
డీఎస్సీ తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించారే కానీ పూర్తిస్థాయిలో ఏ పరీక్ష ఏ రోజు జరుగుతుందనే షెడ్యూల్‌ను ఇంతవరకూ అధికారులు ఇవ్వలేదు. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ చేపట్టారు. అయితే డీఎస్సీ కంటే ముందే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్ మేరకు మార్చి 14న టెట్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించి జూన్ 12న ఫలితాలను ప్రకటించి కొత్తగా టెట్ పాసయ్యే వారికోసం ప్రత్యేకంగా జూన్ 20 వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా టెట్ పాసయ్యే అభ్యర్థులు ఫలితాల తర్వాత తమకు ఓ 20 రోజులు కూడా డీఎస్సీకి సమయమివ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టులో జరిగే ఛాన్స్..
మరోవైపు ఆగస్టు 6, 7వ తేదీల్లో గ్రూప్ పరీక్షలు ఉన్నాయి. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. అంటే డీఎస్సీ, గ్రూప్ పరీక్షలకు మధ్య గ్యాప్ కేవలం 5 రోజులే ఉంటుంది. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇంత వరకూ డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూల్ ఇవ్వలేదని తెలుస్తోంది. డీఎస్సీని వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో ఆగస్టులో జరిగే అవకాశం ఉంది.