నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా

22-04-2024 12:06:54 AM

మహిళా, వ్యవసాయ  కళాశాలలు ఏర్పాటు చేస్తా

రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేస్తున్నా..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి

నిజామాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల్లో  తనకు ఓటు వేసి గెలిపిస్తే నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తానని, వ్యవసాయ, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తున్నానని, అనంతరం కలెక్టర్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారన్నారు.

గతంలో నిజామాబాద్‌లో పెట్రోల్, డీజిల్ స్టాక్ పాయింట్లు ఉండేవని, అవి ఇక్కడి నుంచి తరలిపోవడంతో రవాణా చార్జీలు పెరిగి, ప్రజలపై భారం పడిందన్నారు. తిరిగి ఇక్కడ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. నగరంలో సిటీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆ సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు. జగిత్యాలలో 20 ఏళ్ల క్రితమే తన కృషితో వ్యవసాయ, వ్యమహిళ డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

జగిత్యాల జిల్లాను మామిడి క్లస్టర్‌గా గుర్తించామంటూ ఎంపీ అరవింద్ ప్రకటించారని,  తాను 2008లోనే జగిత్యాల పట్టణంలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. ఎంపీ అరవింద్ కేంద్ర ప్రభుత్వంతో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. ఆర్మూర్ నుంచి అదిలాబాద్, బోధన్  బీదర్ రైల్వేలైన్ల సాధన అరవింద్ పట్టించుకోలేదని, ముంబై ఎక్స్‌ప్రెస్‌కు జగిత్యాలలో హాల్టింగ్ తీసుకురాలేదని మండిపడ్డారు.