మల్లన్న పాదయాత్ర లక్ష్యంచేరేనా!
డా.తిరునహరి శేషు :
రాజకీయాలలో రాజ్యాధికారమనే లక్ష్యాన్ని చేరుకోవటానికి పాదయాత్ర ఒక విజయవంతమైన ఫార్ములాగా కనపడుతుంది. నాయకులు తమ పార్టీ లక్ష్యాలను ప్రజలలోకి తీసుకువెళ్ళటానికి, ప్రజలలో తమ పార్టీపై విశ్వాసాన్ని పెంచటానికి, ప్రజలతో మమేకమై ప్రజల నమ్మకాన్ని చూరగొనటానికి, ప్రభుత్వ వైఫల్యాలను(Government failures) ప్రజలకి చేరవేసి ప్రజలతోనే చర్చించటానికి పాదయాత్రని(Foot March) ఒక సాధనంగా రాజకీయ నాయకులు(Politicians) వాడుకుం టున్నారు. దేశంలో కానీ, రాష్ట్రాలలో కానీ ఒక్క రాజకీయ అధికారం కోసమే పాదయాత్రలు జరగలేదు.
వివిధ సామాజిక అంశాల పైన, ప్రజా సమస్యల పైన, వివిధ వర్గాల సమస్యలపైన కూడా పాదయాత్రలు జరిగాయి. పాదయాత్ర ఒక శక్తివం తమైన సామాజిక రాజకీయ సాధనం. కాబట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో(Freedom Movement) మహాత్మాగాంధీ దండియాత్ర చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనూ, రెండు తెలుగు విభజిత రాష్ట్రాలలో కూడా ఆయా పార్టీల నాయకులు పాదయాత్రలు చేసిన తర్వాత అధికా రంలోకి వచ్చారు.
2025 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక రాజకీయ ఉద్యమకారుడు శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చే పడుతున్న నేపథ్యంలో గతంలో లాగా మల్లన్న కూడా రాజ్యాధికార లక్ష్యాన్ని చేరుకుంటాడా అని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో, ప్రజలలో విస్తృతమైన చర్చ జరుగుతుంది.
పాదయాత్ర - విజయాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రాల వరకు అధికారాన్ని సాధించడానికి రాజకీయ నాయకులు చేసిన పాద యాత్రలు లక్ష్యాన్ని చేరుకున్నాయని చరిత్ర చెబుతుంది. 2003లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతాం గం ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చలించిన నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1470 కిలోమీటర్లు చేసిన పాదయాత్ర రాష్ట్ర పాదయాత్రల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ పాదయాత్ర తరువాత 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావటంతో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది.
2012లో చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీకోసం‘ పాదయాత్ర తరువాత 2014 లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం, 2017లో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర తర్వాత 2019లో అధికారం, 2023లో కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం, 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు నాటి కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి సహకరించాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తరువాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలపడిందనేది కూడా వాస్తవం.
మల్లన్న పాదయాత్ర దశాబ్దాల కలని నెరవేరుస్తుందా!
జనాభాలో అత్యధిక శాతం ఉన్న బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనేది వారి దశాబ్దాల కల.. కానీ, 58 ఏళ్ల సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ.. 12 ఏళ్ల తెలంగాణలో కానీ ఆ కల కలగానే మిగిలిపోయిం ది. ఏడు దశాబ్దాల పాలనలో 18 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడితే వారిలో ఒక్కరూ బలహీనవర్గాల నుండి లేకపోవడం వారికి రాజ్యాధికారం ఎంత దూరమో అర్థం చేసుకోవచ్చు. 18 మంది ముఖ్యమంత్రులలో 17 మంది అగ్రవర్ణాలే, 9 మంది ఒక సామాజిక వర్గం, ము గ్గురు మరొక సామాజిక వర్గం, ఇద్దరు ఇంకొక సామాజిక వర్గం..
కేవలం మూడు కులాల నుండి 15 మంది ముఖ్యమంత్రులుగా పాలన చేశారంటే రాష్ట్ర రాజకీయా లపై అగ్రవర్ణాల ఆధిపత్యం ఎంతగా కొనసాగిందో గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా యి. రాజ్యాధికారమే కాదు రాజ్యాధికారంలో గౌరవప్రదమైన వాటా కూడా బల హీన వర్గాలకి దక్కలేదు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు జాతీయ ప్రాంతీయ పార్టీలలో ఉన్న బలహీన వర్గాల నాయకులు కూడా ఆయా పార్టీలలో బీసీల పక్షాన తమ గొంతు వినిపించలేదంటే రా జకీయ అణిచివేత ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల బల హీన వర్గాలకు చెందిన ఒక మహిళా మం త్రి తన బర్తరఫ్ సందర్భంగా అగ్రవర్ణాలకు ఒక న్యాయం బలహీన వర్గాలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించినా ఆ జాతీయ పార్టీ చర్య తీసుకునే సందర్భంలో ఆమె ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు భవిష్యత్తులోనైనా ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలే కనిపించడం లేదు.
ఇటీవల నేను పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఒక సమావేశానికి హాజరైతే ఒక రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఆ సభలో మాట్లాడుతూ ఒక్క సారి అయినా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చూసి చనిపోవాలని ఉం ది అని చెప్పటం చూస్తుంటే రాజ్యాధికారానికి రావాలనేది బలహీనవర్గాల బలమైన ఆకాంక్షగా కనిపిస్తుంది.
ఒక సంవత్సరం క్రితం శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న వాటా, ఆత్మగౌరవం, రాజ్యాధికారం అనే లక్ష్యం తో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించి అనేక వేదికల పైన రాష్ట్రంలో బల హీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాల పైన ఆ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పైన తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. వెనుకబాటుతనంపై పోరాటం బలహీన వర్గాల మెదళ్ళ నుంచి ప్రారంభం కావాలనే బి.పి.మండల్ వ్యాఖ్యల స్ఫూర్తితో బలహీన వర్గాలకి రాజ్యాధికారం అనే లక్ష్యాన్ని సాధించడానికి సెప్టెంబర్ 17న గోల్కొండ ఖిల్కొండ నుంచి తీన్మార్ మల్ల న్న తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
సెప్టెంబర్ 17 నైజాం నుండి తెలంగాణ విమోచన పొందిన రోజు, గోల్కొండ కోట ను చేజిక్కించుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యానికి తొలి అడు గు వేయడమే అనే సందేశం ఇవ్వటానికే మల్లన్న సెప్టెంబర్ 17న గోల్కొండ ఖిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నాడు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలనేది డిమాండ్ కాదు, అది ఒక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, అధికారానికి దశాబ్దాలుగా దూరమైన ప్రజలనే అధికారం ఇవ్వాలని లక్ష్యసాధనకి కలిసి కదం తొక్కాలని తట్టి లేపే ఒక ఉద్యమ యాత్ర గా మల్లన్న పాదయాత్రని చూడాలి.
మల్లన్న కంటే తను మోసుకుపోతున్న అజెండా బలమైనది, సహజ న్యాయమైనది కూడా. కాబట్టి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, ఇంకా ఎంతో కాలం బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కకుండా అడ్డుకోలేరని చెప్పటమే పాదయా త్ర ఉద్దేశం. రాజ్యాధికారం అనేది బలహీన వర్గాల దశాబ్దాల కల.. అది ఇప్పటివరకు ఆ వర్గాల రాజకీయ నినాదంగానే మిగిలిపోయింది. కానీ, రాజ్యాధికారాన్ని సాధిం చే ఒక కార్యాచరణ దిశగా కొనసాగలేదు. కాబట్టే లక్ష్యాన్ని సాధించే తొలి ప్రయత్నం మల్లన్న పాదయాత్ర.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 243 కులాలలో 200 కులాలు ఇప్పటికీ వెనకబడే ఉన్నాయని ప్రభుత్వ సర్వే లు చెబుతున్న నేపథ్యంలో ఆ వెనుకబాటుకి ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వా లదే బాధ్యత. పాదయాత్ర సామాజిక విభజన, ద్వేషాన్ని పెంచటానికి కాదు.. ఇప్ప టివరకు అణిచివేతకు గురైన వర్గాల కోసం, రాజ్యాధికారం దక్కని వర్గాల ఆత్మగౌరవం కోసం అన్నిటికీ మించి సామాజిక న్యాయం సాధించడానికి 14 వేల కిలోమీటర్లు మల్లన్న పాదయాత్ర చేయబోతు న్నాడు.
తీన్మార్ మల్లన్న పాదయాత్ర తరువాత ఇప్పటివరకు అధికారం దక్కని బల హీన వర్గాలకు రాజ్యాధికారం దక్కితే తెలంగాణ రాజకీయ చిత్రపటంపై ఒక కొత్త రాజకీయ చరిత్ర ఆవిష్కృతమవుతుం ది. తమిళనాడులో ద్రవిడ పార్టీల రాజకీయ ఆధిపత్యానికి విజయ్ గండి కొట్టిన ట్లుగానే తెలంగాణలో అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యానికి మల్లన్న పాదయాత్ర చరమగీతం పాడితే బలహీనవర్గాల చిరకాల స్వ ప్నం సాకారమవుతుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్
9885465877