ఆస్తి కోసం..భర్తనే కడతేర్చారా..?
భర్తను హతమార్చిన పెద్ద భార్య, కుమారులు, కూతుళ్లు
పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న భార్య
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఆస్తి వివాదం నేపథ్యంలో తన భర్తను పెద్ద భార్య, కుమారుడు, కుమార్తెలు కలిసి చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ చిన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సిద్దాపూర్ పోలీస్‌స్టేషన్(Siddhapur Police Station) పరిధిలోని సింగారం గ్రామంలో గురువారం వెలుగుచూసింది.
సింగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాల్నారి (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి చిన్న భార్య కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదులో కృష్ణమ్మ పేర్కొన్న వివరాల ప్రకారం.. బాల్నారికి పెద్ద భార్య సాయిలమ్మతో పాటు కుమారుడు వెంకటయ్య, ఆయన భార్య, కుమార్తెలు బాలమ్మ, సైదమ్మ ఉన్నారు. కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపింది.
ఇటీవల తన అక్క మృతి చెందడంతో నాగర్‌కర్నూల్‌కు వెళ్లామని, అనంతరం తాను తన తల్లి ఊరైన గాజరకు వెళ్లినట్లు కృష్ణమ్మ పేర్కొంది. తన భర్త బాల్నారి సింగారం వెళ్లాడని తెలిపింది. గురువారం ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొంది. ఆస్తి వివాదం కారణంగానే సాయిలమ్మ, వెంకటయ్య, ఆయన భార్య, కుమార్తెలు బాలమ్మ, సైదమ్మ కలిసి తన భర్తను చిత్రహింసలకు గురిచేసి కొట్టి హతమార్చి ఉండవచ్చని కృష్ణమ్మ అనుమానం వ్యక్తం చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.