రైలు ఢీకొని మహిళ మృతి
ఘట్‌కేసర్, మార్చి 4 (విజయక్రాంతి): రైల్వేగేటు వద్ద పట్టాలు దాటుతున్న ఓ మహిళను రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, పెద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన గంగాల బాలమణి (59) బంధువుల దగ్గరికి వేలుతూ ఘట్ కేసర్ పట్టణంలో రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది.
దీంతో ఆ మహిళ ముక్కలై కొంత దూరంలో గుర్తుపట్టలేని స్థితిలో పడింది. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. వంతెన నిర్మాణం జాప్యం వల్లే రైల్వే గేటు దాటుతుండగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




