కాలుజారి చెరువులో పడి మృతి చెందిన మహిళ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కాలు జారీ చెరువులో పడి మహిళా మృతి చెందిన ఘటన ధర్మ రెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు పోచమ్మ వయసు (46) సంవత్సరాలు. జోడు పోచమ్మ గత ఆరు నెలలుగా పక్షవాతం వ్యాధితో బాధపడుతూ కుడి చేయి, కుడి కాలు పనిచేయక అనారోగ్య స్థితిలో ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా జోడు పోచమ్మ తీవ్ర మనస్థాపానికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ అన్నారు.
ధర్మారెడ్డి గ్రామ శివారు పరిధిలోగల చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకొనుటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువు నీటిలో పడడంతో ఈత రాక నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా పోలీసులకు తెలియడంతో స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ సిబ్బందితో కలిసి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని చెరువుల నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు.




