28 April, 2026 | 1:55 AM

నగల కోసమే లాడ్జిలో మహిళ హత్య

28-04-2026 12:00 AM

కేసుని ఛేదించిన పోలీసులు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): గతవారం నగల కోసం ఓ మహిళను లాడ్జికి తీసుకెళ్లి హత్య చేసిన ఘటన చందానగర్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధితురాలిని చున్నీతో గొంతు నులిమి హతమార్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం సోలిపేట్ గ్రామానికి చెం దిన మండల కుమార్ (47) పటాన్చెరు మండలం ఇంద్రేషంకు చెందిన జి.నర్సమ్మ(39) తో పరిచయం పెంచుకున్నాడు.

ఈ నెల 24న రాత్రి ఆమెను చందానగర్లోని ‘నైట్ ఐ ఓయో’ హోటల్లోని రూమ్ నంబరు 405కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యాడు.ఈ ఘటనపై ఏప్రిల్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆర్సీ పురం ఏసీపీ, శేరిలింగంపల్లి డీసీపీ పర్యవేక్షణలో చందానగర్ సీఐ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి నుంచి 2.360 గ్రాముల బంగారు దుద్దులు, మట్టెలు, 444 గ్రాముల వెండి పట్టీలు, 33.850 గ్రాముల వెండి మెట్టెలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసుగా తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించి నట్లు వెల్లడించారు.