ఒక్కో మహిళకు నెలకు 3 వేలు
- నిరుద్యోగులకు నెలకు ౩ వేలు భృతి
- కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటన
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్హంగా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
కోల్‌కతా, ఏప్రిల్ 10: తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలకు రూ.౩ వేల చొప్పున జమ చేస్తామని, తద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే, నిరుద్యోగులకు నెలకు రూ.౩ వేల చొప్పున భృతి అందజేస్తామని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో’ అనే కవితా స్ఫూర్తితో మేనిఫెస్టో రూపొందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఒక కోటి ఉద్యోగాల సృష్టిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. సింగూరులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని షా ప్రకటించారు.
అవినీతి, సిండికేట్‌రాజ్, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లిస్తామని, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ౭వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు నెలల్లోనే బెంగాల్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తామని, ఎయిమ్, ఐఐటీ విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు.




