పతి భిక్ష పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న సతి

10-07-2024 08:42:20 PM

జగిత్యాల, (విజయక్రాంతి): పతి భిక్ష పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రాధేయపడుతున్న సతి ఉదంతం ఇది. జగిత్యాల జిల్లా సారంగాపూర్  రేచపల్లికి చెందిన కొత్తపెల్లి గంగారెడ్డి గత ఏడాది ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా దేశానికి వెళ్ళాడు. సౌదీ వెళ్లిన కొద్ది రోజులకే కంపెనీ నుండి ఫోన్ చేసి మీ భర్త మతిస్థిమితంగా లేదని, కారు పగులగొట్టాడని, పిచ్చి ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం ఇచ్చారని గంగారెడ్డి సతీమణి కొత్తపెల్లి జామున తెలిపారు. అయితే ఈనెల 3వ తేదీన తన గంగారెడ్డి స్వయంగా వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెబుతూనే గొంతును కోసుకున్నాడని చెప్పారు. తన భర్తను సౌదీ నుంచి స్వదేశానికి పంపించడం లేదని విదేశాల్లో కంపెనీ కేసుల పాలు చేస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆమె చెప్పారు.

ఈనెల 3వ తేదీన వీడియో కాల్ చేసిన నుండి ఇప్పటివరకు నా భర్త నుంచి, కంపెనీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ గానీ, సమాచారం కూడా రాలేదని ఆమె రోధిస్తోంది. తన పతి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. ఎలా ఉన్నాడో.. అర్థం కావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన పతి జాడ తెలుసుకొని సౌదీ దేశం నుండి స్వదేశానికి తిరిగి రప్పించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారు. అయితే తన భర్త గంగారెడ్డిని సౌదీ దేశానికి జగిత్యాలకు చెందిన ఎంఎస్ కార్తీక్ ఇంటర్నేషనల్  ద్వారా వెళ్లాడని తెలిపారు. కార్తీక్ ఇంటర్నేషనల్ కంపెనీని సంప్రదిస్తే పట్టించుకోవట్లేదనివెల్లడించారు. తన పతి సౌదీ నుండి స్వదేశానికి తిరిగి రప్పించకపోతే నాకు ఇక చావే శరణ్యమంటూ కన్నీరుమున్నీరుగా గంగారెడ్డి భార్య జామున విలపిస్తున్నారు.