20-02-2026 12:00:00 AM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): పరకాల ఇందిరా మహిళా డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు మరింత వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల ఇందిరా మహిళా డెయిరీ పనుల పురోగతిపై డీఆర్డీఏ, సహకార శాఖల అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా పరకాల ఇందిరా మహిళా డెయిరీకి సంబంధించిన పనుల పురోగతి, మహిళా సమాఖ్యకు ప్రభుత్వపరంగా అందించే సహాయ సహకారాలు, తదితర అంశాలపై డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి లు కలెక్టర్, ఎమ్మెల్యే కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టామో వాటి గురించిన సమగ్ర వివరాలు సిద్ధం చేయాలని డీఆర్డీవో మేన శ్రీను కు తెలియజేశారు.
డెయిరీ కి సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. 25వేల లీటర్ల కెపాసిటి కలిగిన ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేసేవిధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిలో అధికారులు వేగం పెంచాలన్నారు.
అందులో భాగంగా నడికూడలో ఏర్పాటు చేస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ) నిర్మాణ పనులు వేగవంతంగా మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. దామెర రోడ్డు నుండి డెయిరీ ప్లాంట్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని పీఆర్ ఈఈ ఆత్మారామ్ కు తెలియజేశారు. రోడ్డు పనులను త్వరగా మొదలుపెట్టాలన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ బీఎంసీయూల ఏర్పాటుకు కావాల్సిన మిషనరీ, క్యాన్లు, వెహికల్ హైరింగ్ కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత, ఏపీఎం దివాకర్ రాయ్, తదితరులు పాల్గొన్నారు.