4 August, 2026 | 1:47 AM

పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న పోలీస్ బలం

04-08-2026 12:04 AM

సిబ్బంది కొరతతో నాచారం పోలీసులపై పనిభారం రెట్టింపు

శాంతిభద్రతల నిర్వహణ నుంచి సైబర్ నేరాల వరకు ఒకే సిబ్బందిపై భారం 

నాచారం/ఉప్పల్, ఆగస్టు 3  (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాచారం పోలీస్ స్టేషన్ పరిధి కూడా రోజురోజుకు విస్తారమవుతోంది. ఒకప్పుడు పరిమిత జనాభాతో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం నివాస, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా మారింది. నాచారం, మల్లాపూర్, హెచ్‌ఎంటీ నగర్, కార్తికేయ నగర్, ఇందిరా నగర్, సూర్యనగర్, అంబేద్కర్ నగర్, ఈసీఐఎల్కు ఆనుకుని ఉన్న పలు కాలనీల్లో భారీగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడ్డాయి.

దీనితో జనాభా పెరగడమే కాకుండా పోలీసింగ్ అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. అయితే పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పరిధికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగకపోవడం వల్ల నాచారం పోలీస్ స్టేష్ప తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితోనే శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రత్యేక బందోబస్తు, సైబర్ నేరాల విచారణ, మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది.

ఒక్కో పోలీసుపై అనేక బాధ్యతలు

ప్రస్తుతం పోలీసింగ్ విధానం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సాధారణ నేరాల నియంత్రణ, పహారా విధులకే పరిమితమైన బాధ్యతలు ఇప్పుడు విస్తృతమయ్యాయి. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది రోజువారీ ఫిర్యాదుల స్వీకరణతో పాటు కోర్టు విధులు, కేసుల దర్యాప్తు, నిందితుల ట్రాకింగ్, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, సోషల్ మీడియా మానిటరింగ్, సైబర్ నేరాలపై స్పందన వంటి పనులు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపడుతున్న ‘మీ సురక్ష‘, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, సైబర్ క్రైమ్ అవగాహన, మహిళా భద్రత కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో పోలీసుల పనిభారం మరింత పెరుగుతోంది.

పండుగల సీజన్లో మరింత ఒత్తిడి..

నాచారం ప్రాంతం మత, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోంది. బోనాలు, వినాయక చవితి, దసరా, దీపావళి, మొహర్రం, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు విధులు నిర్వహించాల్సి వస్తోంది.

ఒక్కో పండుగ సమయంలో వందలాది మంది పోలీసు సిబ్బంది అవసరమవుతున్నప్పటికీ, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. అలాగే రాజకీయ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల పర్యటనలు, వీఐపీ మూమెంట్లు, కోర్టు బందోబస్తు, ఎన్నికల విధులు వంటి అదనపు బాధ్యతలు కూడా నాచారం పోలీసులపై పడుతున్నాయి. ఈ కారణంగా కొన్నిసార్లు పోలీసులు విశ్రాంతి లేకుండా గంటల తరబడి విధులు నిర్వహించాల్సి వస్తోందని సమాచారం.

సైబర్ నేరాలు కొత్త సవాల్

ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్లు, సోషల్ మీడియా నేరాలు, ఫేక్ లింక్ మోసాలు పెరుగుతున్నాయి. ఈ కేసుల విచారణకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. అయితే పరిమిత సిబ్బందితోనే ఈ కేసులను కూడా పరిశీలించాల్సి వస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించడం, ఫిర్యాదులపై స్పందించడం, సాంకేతిక ఆధారాలు సేకరించడం వంటి పనులు అదనపు భారంగా మారుతున్నాయి.

ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి

నాచారంమల్లాపూర్ ప్రధాన రహదారి, హెచ్‌ఎంటీ నగర్ జంక్షన్, ఈసీఐఎల్ మార్గం, పరిశ్రమల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, స్కూల్ జోన్లలో భద్రతా చర్యలు చేపట్టడం కోసం కూడా పోలీస్ సిబ్బంది అవసరం పెరుగుతోంది. అయితే అందుకు తగిన మానవ వనరులు లేకపోవడం సవాలుగా మారింది.

ప్రజల డిమాండ్  పోలీస్ బలగాన్ని పెంచాలి

పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాచారం పోలీస్ స్టేషన్కు అదనపు సిబ్బందిని కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, సామాజిక సంస్థల నాయకులు కోరుతున్నారు. కొత్త పోస్టులను మంజూరు చేయడం, ఖాళీలను భర్తీ చేయడం, ఆధునిక వాహనాలు, సాంకేతిక పరికరాలు అందించడం ద్వారా పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడుతున్నారు.

ప్రజల భద్రత కోసం బలోపేతమే మార్గం

వేగంగా విస్తరిస్తున్న నాచారం ప్రాంతంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖకు అదనపు వనరులు సమకూర్చడం అత్యవసరంగా మారింది. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో నాచారం పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ, పెరుగుతున్న బాధ్యతలకు అనుగుణంగా సిబ్బంది బలోపేతం చేయకపోతే భవిష్యత్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.