డిగ్రీ చదువు దూరమై.. ఆశలు భారమై!
- ఘట్కేసర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు
- దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఘట్‌కేసర్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : ఘట్కేసర్‌తో పాటు చుట్టుపక్కల నుంచి ప్ర తి ఏటా వేలాది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. అయితే ఉన్నత చదువుల కోసం ముందుకు సాగుదామంటే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వారికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. గతంలో ఇక్కడి గురుకుల్ కళాశాల మైదానంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన జరిపినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ప్రైవేట్ ‘ఫీజుల’ మోత రవాణా అవస్థలు
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెంది న విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో చేరి వే లాది రూపాయల ఫీజులు చెల్లించడం భా రంగా మారింది. వేరే దారి లేక చాలామంది విద్యార్థులు ప్రతిరోజూ కిక్కిరిసిన బస్సుల్లో, రైళ్లలో హైదరాబాద్ నగరానికి ప్రయాణించాల్సి వస్తోంది. ప్రతిరోజూ గంటల తరబడి ప్రయాణానికే సమయం సరిపోవడంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యలోనే ఆగిపోతున్న బాలికల చదువులు
ఈసమస్య వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికలు తీవ్రంగా నష్టపోతున్నారు. దూర ప్రాంతాలకు ప్రతిరోజూ వెళ్లి రావడం భద్రతా పరంగా, ఆర్థికంగా భారమవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియట్తోనే చదువు నిలిపివేస్తున్నారు. ఒకవేళ ఘట్కేసర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందుబాటులో ఉంటే, వందలాది మంది పేద విద్యార్థినులు ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం
ఘట్ కేసర్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప, ఆచరణలో ఏమీ జరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే స్పందించాలి
ప్రభుత్వం వెంటనే స్పందించి ఘట్కేసర్ పట్టణంలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు విద్యావేత్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






