రామప్ప సన్నిధిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

16-09-2026 | 06:52pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని బుధవారం ప్రపంచ బ్యాంకు(World Bank) ప్రతినిధులు పూనమ్ ఆలువాలియా, ఆపూర్వ శేన్వీ, వెంకటరావు, నిత్య, నేహ ప్రవాష్ లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ స్వామివారి శేషవస్త్రాలను బహూకరించారు. రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిన అనంతరం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రసాద్, సాస్కీ పథకాల కింద కొనసాగుతున్న పనుల గురించి హన్మకొండ హార్టికల్చర్, పర్యాటక శాఖ అధికారి ఎం శివాజీ ప్రతినిధులకు వివరించారు.

పర్యాటక గైడ్ విజయ్‌ కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల వైభవం, ఆలయ శిల్పకళ ప్రత్యేకతలను వివరించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని, లక్నవరం సరస్సును కూడా సందర్శించారు. వారి వెంట గ్రూప్ 1 అధికారిణి రవళి, డీటీ భవానీ ప్రసాద్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, శ్రీకాంత్, దశరథ్, శ్రీను, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు