5 July, 2026 | 2:25 AM

250 వసంతాల అమెరికా

05-07-2026 12:00 AM

రెండున్నర శతాబ్దాల క్రితం ‘స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం’ వంటి మహోన్నత ఆశయాలతో పురుడుపోసుకున్న అమెరికా నేడు 250వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఒకప్పటి బ్రిటిష్ వలస కాలనీగా ఉండి నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగిన అమెరికా ప్రయాణం గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 250 ఏళ్లు ఒక దేశ గమనం మాత్రమే కాదు; ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగం, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన ఒక చరిత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికా ఒక్క రోజులోనే అగ్రరాజ్యంగా ఎదగలేదు. సహజ వనరులు, విస్తారమైన భూభాగం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి, ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభను ఆకర్షించే విధానాలు, విద్యావ్యవస్థలు కలగలిసి అమెరికాను మహాశక్తిగా తీర్చిదిద్దాయి. వాస్తవానికి అమెరికా ప్రస్థానాన్ని మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ తర్వాత అనే కోణంలో చూడాలి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు కుదేలవడంతో అమెరికా ప్రపంచ పెద్దన్నగా ఎదిగింది.

అదే సమయంలో అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రతిభ, పరిశోధనలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు అగ్రరాజ్యం విజయానికి దోహదం చేశాయి. అయితే తమ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా అదే విలువలను పాటించిందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.

ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ పేరుతో అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, కొన్ని దేశాలకు వత్తాసు పలకడం, మరికొన్ని దేశాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు అమెరికా వైఖరిపై ప్రశ్న లు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు శాంతి ప్రవచనాలు వల్లెవేస్తూనే, మరోవైపు ఆయుధాల కర్మాగారంగా మారిన అమెరికా నాయకత్వం తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యమనే భావనకు క్రమంగా బీటలు వారుతున్నాయి.

ఆధిపత్య రాజకీయాలు, యుద్ధాలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ప్రపంచంపై ఆధిక్యాన్ని కోల్పోయే ముప్పు ముంగిట నేడు అమెరికా నిలిచి ఉంది. రెండున్నర శతాబ్దాల అమెరికా పయనం ఆ దేశంతోపాటు ప్రపంచానికి కూడా ఎన్నో పాఠాలు నేర్పింది. ఇప్పుడు ఆ అగ్రరాజ్యం అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలోనైనా అగ్రరాజ్యమంటే ఆధిపత్యం కొనసాగించడమే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా నిలబెట్టడమని అమెరికా గుర్తిస్తుందో, లేదో చూడాలి.