5 July, 2026 | 2:27 AM

విప్లవ గీతాల నిప్పుకణిక

05-07-2026 12:00 AM

అరుణోదయ నాగన్నకు నివాళి :

యుద్ధరంగంలో తుపాకీ గొట్టం ఎంత శక్తివంతమైనదో, ప్రజాక్షేత్రంలో డప్పు చర్మంపై పడే దెబ్బ అంతకంటే పదునైనదని నిరూపించిన మహోన్నత ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న. పల్లె పల్లెనా విప్లవ చైతన్యపు విత్తనాలు నాటి, పాలకుల గుండెల్లో తన పాటల తూటాలతో వణుకు పుట్టించిన ఆ గొంతుక నేడు మూగబోయింది. నాగన్న ఒక గాయకుడే కాదు; ఆయన ఒక సామాజిక ఉద్యమం.

నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల నుంచి మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రతి ప్రజా పోరాటంలోనూ నాగన్న పాట ముందంజలో నిలిచింది. అరుణోదయ వేదికలపై ఆయన డప్పు పట్టి అడుగులు వేస్తుంటే, చూసే ప్రతి శ్రామికుడి నరనరాల్లోనూ విప్లవ రక్తం ఉరకలేసేది.

దోపిడీ వ్యవస్థ పునాదులను కదిలించేలా, గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన ఎన్నో విప్లవాత్మక గీతాలకు ప్రాణం పోశారు. ప్రజా చైతన్యానికి మించిన ఆయుధం లేదని, ఆ చైతన్యాన్ని రగిలించడానికి పాటను మించిన మాధ్యమం మరొకటి లేదని ఆయన నిరూపించారు.

చివరి శ్వాస వరకు జనం పక్షాన నిలబడి వ్యవస్థలోని కుళ్లును కడిగిపారేసిన నిస్వార్థ యోధుడాయన. తెలంగాణ సమాజం, ముఖ్యంగా విప్లవ సాంస్కృతిక ప్రపంచం ఒక గొప్ప ప్రజా కళాకారుడిని కోల్పోయింది. నాగన్న రగిల్చిన చైతన్య దీప్తులు ఎప్పటికీ ఆరిపోవు. ఆయన పాడిన పాటలు, వేసిన అడుగులు భావితరాల పోరాటాలకు ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తూనే ఉంటాయి.

రాజేందర్ దామెర(దారా)