14 March, 2026 | 4:26 AM

విద్యార్థులూ విజయోస్తు

14-03-2026 12:39 AM

పది ఫలితాలతో మీరంతా మెరవాలి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మార్చి 13 (విజయ క్రాంతి): కన్నవారి కలలను నెరవేర్చేందుకు.. ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు పదవ తరగతి విద్యార్థులు ఈనెల 14 నుంచి జరిగే పరీక్షలను మంచిగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా  పరీక్ష  రాయనున్న 5, 17,727 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్ష కేంద్రాలకు  సమయానికన్నా అరగంట ముందు కచ్చితంగా వెళ్లాలని సూచించారు.

ముఖ్యంగా తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ ముందస్తుగా అభినందనలు తెలిపారు.  విద్యార్థులకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తాను పదవ తరగతి చదివే పేద విద్యార్థులందరికి దాదాపుగా 20వేల మందికి ఉచితంగా సైకిళ్లను అందించానని గుర్తు చేశారు. పరీక్షల సమయంలో అనవసరమైన ఆందోళన ఒత్తిడికి గురి కాకూడదని, ఇన్నాళ్లు శ్రద్ధతో చదివిన సబ్జెక్టులను పునశ్చరణ చేసుకొని మంచిగా పరీక్ష రాయాలని హితవు పలికారు.

గతేడాది పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఉత్తీర్ణతా పరంగా ఆరో స్థానంలో, సిరిసిల్ల జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందని.. ఈసారి తప్పకుండా ఈ రెండు జిల్లాలు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు తగిన వసతులను కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వారికి  ఫ్యాన్ల సదుపాయంతో పాటు మంచినీళ్లు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.  మరోవైపు విద్యార్థులను తల్లిదండ్రులు  క్షేమంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి పరీక్ష లో పాసై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, శత శాతం ఫలితాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.