ఇంటి నంబర్‌తో పాటు ‘సీఎన్’ రాయాలి
సెన్సెస్ జేడీ సుబ్బరాజు
ములుగు (మహబూబాబాద్) మే 12 (విజయక్రాంతి): ప్రతి ఇంటి నంబర్ ఎదురుగా ‘సీఎన్’ అని తప్పనిసరిగా రాయాలని సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు జనగణన అధికారులకు సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ మొదటి విడత పనులను హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారాజు మంగళవారం పరిశీలించారు.
మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 13 సాయంత్రం లోపు తమకు కేటాయించిన ప్రతి ఇంటికి ఇంటి నంబర్లు పూర్తి చేయాలని సూచించారు.
జూన్ 9 వరకు ఈ పని కొనసాగుతుందని, అందరూ అదే స్ఫూర్తితో పని చేయాలని ఛార్జ్ అధికారులు, అడిషనల్ ఛార్జ్ అధికారులను కోరారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని కూడా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సస్ ఇంచార్జ్ వినయ్,ములుగు సీపీవో జిల్లా సెన్సస్ అధికారి ఎం. ప్రకాష్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్ నాయక్,ఫీల్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.






