23 August, 2026 | 1:36 AM

వందేమాతర గీతంపై దేశవ్యాప్త ప్రచారం

23-08-2026 12:56 AM
  1. కాంగ్రెస్ ‘రెండు చరణాల గీతం’ తీర్మానాన్ని ఖండిస్తున్నాం
  2. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
  3. ఢిల్లీలో పార్టీ నూతన జాతీయ కార్యవర్గ తొలి సమావేశం
  4. గీతం గౌరవాన్ని కాపాడేందుకు 10 సూత్రాల తీర్మానానికి ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు ౨౨: ‘వందేమాతర గీతం భారతదేశ చారిత్రక వారసత్వం. అందుకే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు చరణాల గీతానికి చట్టబద్ధత కల్పించింది. కేవలం రెండు చరణాలు మాత్రమే తమకు సమ్మతమని కాంగ్రెస్ తీర్మానం చేయడాన్ని మేం ఖండిస్తున్నాం. సంపూర్ణ వందేమాతర గీతం పరిరక్షణే మా ధ్యేయం. జాతీయ గీత పరిరక్షణ కోసం బీజేపీ తన ౧౦ సూత్రాల తీర్మానాన్ని అమలు చేయబోతున్నది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు.

న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ అధ్యక్షతన నూత న జాతీయ కార్యవర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గం వందే మాతర గీతంపై 10 సూత్రాల తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం నితన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విధానాలు సంకుచితమైన వని, అందుకే.. ఆ పార్టీ కేవలం రెండు చరణాల గీతం తమకు సమ్మతమని తీర్మానం చేసిందని దుయ్యబట్టారు. జాతీయ గీతం విషయంలో బీజేపీ రాజీపడబోదని స్పష్టం చేశారు. 

ఆరు చరణాల జాతీయ గీత వారసత్వాన్ని యావత్ దేశ ప్రజలకు తెలియజెప్పేం దుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగడతామని, కొన్ని వర్గాలను బుజ్జగించేందుకు జాతీయ గీతాన్ని అగౌరవపరిచే విధానాలను తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం ఒక సామ్రాజ్య వాద వ్యతిరేక నినాదమని స్వయంగా మహాత్మాగాంధీ కొనియా డారని, కాంగ్రెస్ ఆ విషయాన్ని మరచిపోయిందని దేశ ప్రజలకు చాటిచెబుతామని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీకి ప్రియాంక్ ఖర్గే సవాల్

వందేమాతర గీతంపై బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదం తెలిపిన 10 సూత్రాల తీర్మానంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. టెలీప్రాంప్టర్ లేకుండా ముందుగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరు చరణాల వందేమాతర గీతాన్ని ఆలపించాలని సవాల్ విసిరారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఇప్పుడు దేశభక్తిని నిరూపిం చుకోవాల్సిన సందర్భం వచ్చిందని, ఆర్‌ఎస్‌ఎస్ నేతలంతా ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా జాతీయ గీతంలోని మొత్తం చరణాలు పాడాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ఖర్గే డిమాండ్ చేశారు.