అధికారులపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆగ్రహం..
జంతువులకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు
ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి వచ్చి దివ్యాంగులకు సైకిళ్ళు అందజేసే విషయం కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం లేదని మండిపడ్డారు.
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు అధికారులు కనీసం సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. వందలాది సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలతో ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని, అటవీ అధికారులు హింసించడం మానుకోవాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సహకరించి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు.
పిల్లలకు మెరుగైన విద్య అందించండం ముఖ్యం, చదువే భవిష్యత్తు నిర్మిస్తుంది కానీ ఇతర పనులు కాదని అన్నారు. గతంలో గిరిజనులతో కలకళలాడిన ఐటిడిఎ లు ఇప్పుడు కనీసం గెట్ వద్దకు కూడా ప్రజలు రాక దివాలగా మారిందన్నారు . ఐటీడీఏకు నిధులు కేటాయించి అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు కీలక అంశాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీసుకువచ్చారు. ఫారెస్టు అధికారులు అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి ఇతవు పలికారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పెంచి విద్యార్థుల భవిష్యత్తుకు సహకరించాలి. ఐటిడిఎను అభివృద్ధి చేసి వాటికి అధికారం ఇవ్వాలి. ఎస్సి కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో గల బోర్లు, మోటర్ల సమస్యలు తీర్చాలి. NH 44 జాతీయ రహదారిపై ఉండే నెరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అటవీశాఖ భూమి అని తిప్పలు పెట్టడం సరికాదు. పోడు పట్టాల రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు. జంతువుల కోసం ఫ్లైవర్లు నిర్మిస్తున్నారు కానీ గిరిజనులను కనీసం కనికరించట్లేదు.






