రోహిత్‌ను ట్రోఫీతో చూడాలనుంది
హిట్‌మ్యాన్‌పై యువీ ప్రశంసలు
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడిలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ జట్టులో ఉండడం కీలకమని తెలిపాడు. రోహిత్‌ను ప్రపంచకప్ ట్రోఫీతో చూడాలని ఆశగా ఉందని పేర్కొన్నాడు. పొట్టి ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యువరాజ్ మాట్లాడుతూ..‘ రోహిత్ సారథ్యంలో భారత్ 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా ముంబై జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించి పెట్టాడు. అలాంటి కెప్టెన్ టీ20 ప్రపంచకప్‌కు ఎంతో అవసరం. ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకునే తెలివైన కెప్టెన్ మనకు కావాలి. ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా రోహిత్‌కు ఉంది. మైదానంలో నాయకుడిగా సహచరులకు అండగా ఉంటాడు’ అని వెల్లడించాడు. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టులో యువరాజ్, రోహిత్‌లు సభ్యులుగా ఉన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఇక భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.






