రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించాలి
నిర్మల్ అక్టోబర్ 28( విజయ క్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించడంతో పాటు, ప్రాణనష్టాన్ని నివారించే లక్ష్యంతో పీఎం రాహత్ పథకాన్ని(PM Rahat scheme) జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్‌మెంట్) పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకం అమలులో నిర్లక్ష్యం వహించకుండా, బాధితులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, అమలును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు తిరుపతి, అసీఫ్, రజినీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.