తెలంగాణ ఉద్యమ చరిత్రను యువతకు వివరించాలి

29-11-2026 | 02:27pm

బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఎడపల్లి మండల కేంద్రంలోని సారాయి ఫంక్షన్ హాల్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షెకీల్ అమీర్(Former MLA Shakeel Aamir) ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీల్లో పనిచేసి, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను సన్మానించాలని సూచించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులందరికీ నమస్కారాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా షెకీల్ అమీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 17, 18 ఏళ్ల వయసున్న యువతలో చాలామందికి దీక్షా దివస్ ఎందుకు నిర్వహిస్తారో, తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలియదన్నారు. యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాలను వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నాలుగైదేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తిరిగి ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేసిందన్నారు. గతంలో విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి ఇబ్బందులు ఉండేవని, పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో వీటితో పాటు పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలు, పింఛన్లు తదితర సమస్యల పరిష్కారానికి పలు సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ విశేష కృషి చేశారని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై షెకీల్ అమీర్ విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు, వ్యవసాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను గ్రామగ్రామాన యువతకు వివరించాలని, బోధన్ నియోజకవర్గంలో షెకీల్ అమీర్ నాయకత్వంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. రైతాంగానికి, యువతకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న విఠల్ రావు, విజీ గౌడ్, గిర్ధావర్ గంగారెడ్డి, ఆయేషా ఫాతిమా, బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బోధన్ టీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు