కేసీఆర్ దీక్ష చరిత్రలో చిరస్మరణీయం
మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు
ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 29 (విజయక్రాంతి): కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్మరణీయం అని గండ్ర దంపతులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy), వరంగల్ రూరల్ మాజీ జెడ్పి ఛైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రతి సంవత్సరం నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని గండ్ర దంపతుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి జై తెలంగాణ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులలు అర్పించి తర్వాత అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ ఫోటో గ్యాలరీని సందర్శించి, నాటి ఉద్యమ ఘట్టాలను, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలోని చారిత్రక సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా, ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.