గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
కొండగట్టు నుంచి జేఎన్టీయూ వరకు పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల, నవంబర్ 29 (విజయక్రాంతి): ఈ నెల 30 న సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ నెల 30న జగిత్యాల జిల్లాకు చేరుకుని కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకోనున్నారని, అనంతరం జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ముందుగా గవర్నర్ చేరుకోనున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి, అక్కడ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, బ్యారికేడింగ్, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. హెలిప్యాడ్ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే హెలిప్యాడ్ పరిసరాల్లోకి అనుమతించాలని, ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అనంతరం గవర్నర్ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన అతిథిగృహాన్ని పరిశీలించి, అక్కడ నిర్వహించనున్న గౌరవ వందనం, జాతీయ గీతం, రాష్ట్ర గేయం ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. అతిథి గృహంలో విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత, భద్రత తదితర అంశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జేఎన్టీయూ అడ్మిన్ బ్లాక్ వద్ద గవర్నర్ పాల్గొననున్న సమీక్ష సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వేదిక, సీటింగ్, సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, ఇతర సాంకేతిక ఏర్పాట్లను తనిఖీ చేశారు. సమావేశానికి హాజరయ్యే అధికారులు, ప్రముఖులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టాళ్లను పరిశీలించి, మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, వారి జీవనోపాధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రతిబింబించేలా స్టాళ్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గవర్నర్ స్టాళ్లను సందర్శించిన సమయంలో మహిళా సంఘాల ప్రతినిధులు తమ ఉత్పత్తులు, కార్యక్రమాల వివరాలను వివరించేలా ఏర్పాట్లు చేయాలని, డి ఏ ఓ, డీఆర్డీఏ, ఇతర అధికారులను ఆదేశించారు.
తదుపరి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని పరిశీలించి గవర్నర్ స్వాగత ఏర్పాట్లు, దర్శనం, అభిషేకం, పూజా కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గవర్నర్, ఇతర ప్రముఖులు, అధికారుల కోసం ఏర్పాటు చేయనున్న భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, వడ్డింపు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా జేఎన్టీయూ అడ్మిన్ బ్లాక్ సమీపంలో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీకి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో విస్తృత అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గవర్నర్ సమీక్షలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్, నిక్షయ్ మిత్ర కార్యక్రమం, అనీమియా ముక్త్ భారత్, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, అతిథిగృహం, ఆలయం, జేఎన్టీయూ పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు. విధులకు కేటాయించిన పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసూనాంబ, అదనపు ఎస్పీ చైతన్ నితిన్ డిఎస్పి పురుషోత్తం రెడ్డి ఆర్డీవోలు తాసిల్దారులు రెవెన్యూ, పోలీసు, ఆర్ అండ్ బీ, దేవాదాయ, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.