జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి

29-11-2026 | 02:22pm

ప్రభుత్వం వెంటనే స్పందించాలి..

డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్

చౌటుప్పల్, నవంబర్ 29: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై పాలకులు నిర్లక్ష్యం వీడాలని ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్(Chilakala Srinivas Yadav) డిమాండ్ చేశారు. ఎండ, వాన, రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. వార్తల సేకరణకు అయ్యే ప్రయాణ, ఫోన్, ఇతర ఖర్చులను సైతం సొంతంగా భరిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేదా గృహాలు కల్పించాలని కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు పరిమితులు లేని నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని, సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల గౌరవ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి, బాధితులకు వైద్య, ఆర్థిక, న్యాయ సహాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ఉన్నత విద్య వరకు ఉపకార వేతనాలు, విలేకరులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

ప్రధాన మీడియాతో పాటు డిజిటల్ మీడియా, చిన్న పత్రికలు, గ్రామీణ విలేకరులు, ఫొటో, వీడియో, వార్తా విభాగం జర్నలిస్టులందరికీ పారదర్శకంగా గుర్తింపు కల్పించాలని, చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనల్లో న్యాయం చేయాలని కోరారు. అర్హులందరికీ ఆరోగ్య కార్డులు, ఆర్టీసీ ప్రయాణ సదుపాయాలు అందేలా సమీక్ష నిర్వహించాలన్నారు.ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ సమస్యలపై ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రత్యేక నిధి ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్ కోరారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు