పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను ప్రారంభించిన ఐజీ
ఆర్మూర్, నవంబర్ 27 (విజయ క్రాంతి) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లోని రఘునాథ్ చెరువు వద్ద నిర్వహిస్తున్న వాటర్ స్పోర్ట్స్ పోటీలను స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివిధ పోలీస్ విభాగాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ పోటీలలో పాల్గొన్నారు. క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తి, పట్టుదల, పోటీతత్వం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడా పోటీలు దోహదపడుతున్నాయని అన్నారు. పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన పోలీస్ సిబ్బందికి ఐజీ బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం , క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.
ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోలీస్ సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం , క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఒక మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. క్రీడల్లో గెలుపు మాత్రమే కాదని క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు డిసిపి అడ్మిన్ ఎన్.శుభం ప్రకాష్, జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, క్రీడాకారులు పాల్గొన్నారు.