జిల్లా లో సన్న బియ్యం ధరలపై అధికారుల నిఘా

30-10-2026 | 02:44pm
  1. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు
  2. బియ్యం దుకాణాల్లో నిల్వలు, ధరల వివరాలు బహిరంగంగా ప్రదర్శించాలి
  3. జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

పెద్దపల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): జిల్లా లో సన్న బియ్యం ధరల నియంత్రణలో వ్యాపారులు పారదర్శకత పాటించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు(Additional Collector B. Sriramulu) ఆదేశించారు. బియ్యం కొరత ఉందంటూ ప్రజల్లో ఆందోళన సృష్టించడం, కృత్రిమ కొరతకు కారణమవడం, అక్రమంగా నిల్వలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని తన ఛాంబర్‌లో హోల్‌సేల్ బియ్యం వ్యాపారులతో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బియ్యం ధరలు, నిల్వలు, విక్రయాల నిర్వహణపై వ్యాపారులకు పలు సూచనలు చేశారు.

దుకాణాల్లో ధరల వివరాలు తప్పనిసరి

జిల్లాలో ప్రతి బియ్యం దుకాణంలో నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. దుకాణాల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి, విక్రయించే బియ్యం రకాలు, బ్రాండ్లు, వాటి ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. వినియోగదారులకు బియ్యం ధరలు, బరువుపై ఎలాంటి సందేహాలు లేకుండా పారదర్శకంగా విక్రయాలు జరపాలని తెలిపారు.

బస్తాల బరువులో మోసాలకు తావివ్వొద్దు

బియ్యం బస్తాల బరువులో వ్యత్యాసాలు ఉండకూడదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. 26 కిలోల బియ్యం బస్తాలో 25 కిలోల బియ్యం మాత్రమే ఉంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత బరువుకు అనుగుణంగా వినియోగదారులకు బియ్యం అందించాలని ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

జిల్లాలో బియ్యం దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, అ తనిఖీల్లో నిల్వల వివరాలు, రికార్డుల నిర్వహణ, బియ్యం విక్రయాలపై ప్రత్యేకంగా పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించడం వంటి ఉల్లంఘనలు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో బియ్యం సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, బియ్యం వ్యాపారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు