ప్రభుత్వ ఆసుపత్రి వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందజేత
యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
పెద్దపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పేద రోగులకు సేవలందిస్తున్న వాలంటీర్లను ప్రోత్సహించే లక్ష్యంతో యాదవ చారిటబుల్ ట్రస్ట్(Yadav Charitable Trust) ముందడుగు వేసింది. పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 నెలలుగా సేవలందిస్తున్న వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) చేతుల మీదుగా గౌరవ వేతనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, నిరుపేద రోగులకు సహాయ సహకారాలు అందిస్తూ, వైద్య సేవలను సులభంగా పొందేలా వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సేవాభావంతో పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
సమాజ సేవే లక్ష్యంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రజలకు అవసరమైన సందర్భాల్లో తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు. వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందించడం ద్వారా వారి సేవలను గుర్తించడంతో పాటు, మరింత ఉత్సాహంతో సేవలందించేలా ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని వివరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ మారం తిరుపతి యాదవ్, ట్రస్టీ సామ తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.