ఇందిరమ్మ బీమా కోసం ఇంటి బిల్లుల వసూళ్లా?
మంథని, నవంబర్ 26 (విజయ క్రాంతి): పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం (Government) అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా (Indiramma Insurance) పథకం పేరుతో గ్రామస్థాయి సిబ్బంది ఇంటి బిల్లుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలో కలకలం రేపుతున్నాయి. ఇంటి బిల్లు చెల్లించకపోతే ఇందిరమ్మ బీమా ప్రక్రియ (Insurance Process) చేపట్టబోనని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒత్తిడి చేస్తూ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన పేద ప్రజలను బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ బీమా ప్రక్రియకు ఇంటి పన్ను బిల్లుల చెల్లింపును ముడిపెట్టే అధికారం కార్యదర్శికి ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు, వసూళ్లు లేకుండా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ (Investigation) జరిపి నిజానిజాలు వెలికితీయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇందిరమ్మ బీమా సంక్షేమ పథకమా.. లేక ఇంటి బిల్లుల వసూళ్లకు మార్గమా? అనే ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.