శ్రీవారికి రూ.206 కోట్ల కానుక.. 121 కిలోల బంగారం

26-11-2026 | 02:09pm

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy)కి ఓ భక్తుడు అపురూపమైన కానుక సమర్పించారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త, భక్తుడు వర్ధమాన్ జైన్(Vardhman Jain) ఏకంగా 121 కిలోల బంగారం(121 Kg Gold Donation)తో తయారు చేయించిన స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లు ఉంటుందని అంచనా. టీటీడీ చరిత్ర(TTD History)లో ఒకే భక్తుడు సమర్పించిన అత్యంత భారీ బంగారు ఆభరణాల కానుకల్లో ఇది ఒకటిగా నిలిచింది.

శ్రీవారికి నిత్యం, విశేష సందర్భాల్లో అలంకరించేందుకు ఈ ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇందులో బంగారు కిరీటం, శంఖుచక్రాలు, వడ్డాణం, భుజకీర్తులు, అభయహస్తాలు, పాదాల ఆభరణాలు తదితరాలు ఉన్నాయి. మొత్తం తొమ్మిది సెట్లుగా వీటిని రూపొందించినట్లు సమాచారం. టీటీడీ అధికారులు, అర్చకుల సూచనలు, ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా సుమారు 15 నెలల పాటు వీటి తయారీ జరిగింది.

వర్ధమాన్ జైన్ గతంలోనూ టీటీడీకి పలు రూపాల్లో సహకారం అందించారు. ఈ ఏడాది మే నెలలో ఆలయ రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. ఎస్వీబీసీ అభివృద్ధి, టీటీడీ గోశాల, భక్తుల కానుకల లెక్కింపు వ్యవస్థకు కూడా గతంలో ఆర్థిక సహాయం అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.

భక్తులు సమర్పించే ఆభరణాలు శ్రీవారి నిత్య అలంకరణల్లో ప్రత్యేక స్థానం పొందుతాయి. తాజాగా అందిన 121 కిలోల స్వర్ణాభరణాలు కూడా ఆ సంపదకు మరింత విలువను చేకూర్చనున్నాయి. ఒకే భక్తుడు ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను సమర్పించడం భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు