రోడ్లపై ఆక్రమణలు తొలగింపు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
ఎస్ఐ చంద్రకుమార్
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం(Sultanabad Town)లో ట్రాఫిక్ సమస్యలను నివారించడంతో పాటు వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సుల్తానాబాద్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా బుధవారం చర్యలు చేపట్టారు.
సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళ్లే రహదారిపై డివైడర్ పక్కన అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి తొలగించారు.రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆటో, జీప్ యజమానులను హెచ్చరించారు.
అదేవిధంగా, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా కిరాణా దుకాణాల ముందు ఉన్న ఆక్రమణలను, రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను మున్సిపల్ కమిషనర్ రమేష్, సిబ్బందితో కలిసి తొలగించారు. రోడ్లను ఆక్రమించి ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు కలిగించవద్దని ఎస్ఐ చంద్రకుమార్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చంద్రకుమార్ హెచ్చరించారు.