పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక
ఎర్రుపాలెం అక్టోబర్ 14 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(Telangana Progressive Recognized Teachers Union) ఖమ్మం జిల్లా నూతన కోర్ కమిటీలో ఎర్రుపాలెం మండలానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయ నాయకులు వెల్లంకి నాగరాజు ఏకగ్రీవంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
గత 15-16 ఏళ్లుగా సంఘంలో నిబద్ధతతో పనిచేస్తూ, ఆరేళ్ల పాటు ఎర్రుపాలెం మండల అధ్యక్షుడిగా, అనంతరం జిల్లా కార్యదర్శిగా సేవలందించిన నాగరాజు ఎన్నిక పట్ల ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఎర్రుపాలెం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొగ్గుల మదన్ మోహన్ రెడ్డి, మారపాక బాబూరావు ఘనంగా అభినందించారు.
తన సుదీర్ఘ సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా రాజశేఖర్, ఆర్. రంగారావుతో పాటు జిల్లా, మండల నాయకత్వానికి, ఉపాధ్యాయ మిత్రులందరికీ వెల్లంకి నాగరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.