న్యాయం ఎవరు చేస్తారు..?
గ్రామపంచాయతీ పనులు చేస్తూ..
తీవ్రంగా గాయపడి పని చేయలేని స్థితిలో భర్త
కుటుంబ పోషణ భారమవుతుందని
ఆదుకోవాలని రత్నాపూర్ గ్రామపంచాయతీ ఎదుట భార్య ఆందోళన
రామగిరి సెప్టెంబర్ 26(విజయక్రాంతి): రామగిరి(Ramagiri) మండలంలోని రత్నపూర్ గ్రామ పంచాయతీ లో పనిచేస్తూ ప్రమాదవశాస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న మెట్టు రవి కుటుంబం న్యాయం కోసం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం రవి భార్య సంధ్య తన కుమారుడు సిద్ధు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ ఆవరణలో దీనస్థితిలో కూర్చొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది.
మెట్టు రవి గతంలో గ్రామపంచాయతీ పరిధిలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని విద్యుత్ దీపాలకు బల్బులు అమర్చే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు.
ప్రమాదం అనంతరం కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని సంధ్య తెలిపారు. చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం రవి పూర్తిస్థాయిలో పనులు చేయలేని పరిస్థితిలో ఉండటంతో కుటుంబానికి ఆదాయ మార్గం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త పని చేయలేడని, ఇంటిని ఎలా నడపాలని, పిల్లలను ఎలా పోషించాలి అంటూ రవి భార్య సంధ్య కన్నీటి పర్యంతమైంది. ప్రమాదంలో గాయపడిన రవికి తగిన సహాయం అందించి,తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామపంచాయతీ అధికారులను కోరింది. తమ కుటుంబ పరిస్థితిని అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రవి కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.