మన గోదావరి.. మన బాధ్యత
స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూజేఐ పాత్రికేయులు
పెద్దపల్లి, అంతర్గాం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): జీవనది గోదావరిని పరిశుభ్రంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటుతూ ఎన్టీపీసీ రామగుండం(NTPC Ramagundam) ఆధ్వర్యంలో సోమవారం అంతర్గాం మండలం గోలివాడ పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూజేఐ), అంతర్గాం–రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
గోదావరి నది తీరంలో చెత్తాచెదారాన్ని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. సేకరించిన వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తరలించారు. గోదావరి నదిని సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు సుస్థిర పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాత్రికేయులు సహకరించారు.
ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఈడీ(ఆర్అండ్‌టీ) చందన్ కుమార్ సమంత పాత్రికేయులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు, గోలివాడ, విలేజ్ అంతర్గాం గ్రామస్థులతో కలిసి పాత్రికేయులు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.