మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం(Drug free india program)లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీరంగాపూర్ విద్యార్థులు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రూపొందించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వీడియోలు, పాటలను విద్యార్థులకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మోజెస్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ జీవితానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువుపై దృష్టి సారించడంతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు.మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మోజెస్, వైద్యులు డాక్టర్ రాములు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.