రైతుల సంక్షేమమే పాక్స్ లక్ష్యం
కోనరావుపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రైతులకు పాక్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కోనరావుపేట పాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్(PACS Chairman Chepuri Gangadhar) అన్నారు. సోమవారం కోనరావుపేట మండల కేంద్రంలోని పాక్స్ కార్యాలయంలో రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ.. రైతులు సాగు ప్రారంభించిన నాటి నుంచి పాక్స్ ద్వారా బ్యాంకు సహకారంతో పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు తదితరాలను అందిస్తున్నామని తెలిపారు.
రైతులు పండించిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్స్ రైతుల సంఘమని, దాని అభివృద్ధి, పరిరక్షణకు రైతులు బాధ్యతగా వ్యవహరించాలని గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం హాజరయ్యారు. పాక్స్ పరిధిలోని డైరెక్టర్లు, సీఈవో కేశవులు,సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.