తుక్కుగూడలో కొత్త తెలుగు శాసనం

10-10-2026 | 05:10am
  1. వెంకటపతి కొండపై 18వ శతాబ్దపు తెలుగు శాసనం
  2. కనుగొన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

రంగారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడలోని వేంకటేశ్వరాలయ ప్రాంగణంలో కొత్త శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఉపాధ్యక్షులు బీవీ భద్రగిరీశ్, వేముగంటి మురళీకృష్ణ, సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, యాదేశ్వర్ దండేత్కర్, కావలి చంద్రకాంత్, అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ గుర్తించారు. హరగోపాల్ ఈ శాసనాన్ని చదివి పరిష్కరించారు.

తుక్కుగూడలో చిన్న బోడగుట్ట మీద వేంకటేశ్వరాల యం.  అంతా ఒక అంతస్తు, రెండంతస్తుల ఎత్తులో దేవాలయాలు. ఒకటి వేంకటేశ్వరునిది. మరొకటి శివాలయం. రెండు గుహల్లోనే ఉన్నాయి. ఈ గుడులు, శిల్పాలు అన్నీ 17వ శతాబ్దం తర్వాతవే. అంతకు ముందరి శిల్పాలు లేవు.   

మెట్లెక్కి పైకి పోగానే 4స్తంభాల కళ్యాణమంటపం. ఆ స్తంభాలు రాష్ట్రకూటశైలి స్తంభాల అనుకరణ. ఆ పక్కన సత్రం. రథం. పడుమటికి మెట్లెక్కి లోపలికి పోతుంటే దారి రాతిగుండ్ల మధ్య నుంచి గుండ్ల నడుమ రాతిగోడ మీద విష్ణు అర్థశిల్పం. హనుమంత శిల్పాలు, గరుడాళ్వారు. గుడిలోనికి ద్వారానికి వైష్ణవద్వారపాలకులు, రాతిగుండ్ల మీద ద్వారపాలకులు మొత్తం నలుగురు అగుపిస్తారు. 

గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా శ్రీదేవి, పద్మావతులతో వేంకటేశ్వర్లున్నారు. నేరుగా చూడలేనందుకు ఎదురుగా అద్దంలో దర్శనం. కూకట్‌పల్లి రంగనాయకాలయంలో ఉన్నట్టే, ఇక్కడ ఆ ఏర్పాటుంది. అవతలివైపు గుహలో కిందికిలోతున వుంటుంది. అందులో శివలింగం, నంది, వినాయకశిల్పాలున్నాయి. గుడిబయట వీరభద్రుని అర్థశిల్పం ఆరు అడుగులకు ఎక్కువే ఎత్తుంటుంది. గుడి నిర్మాత తన ఇద్దరుభార్యలతో అర్థశిల్పాల రూపంలో గుడిలోనికి వెళ్లే తోవలో రాతిగుండుపైన కనిపిస్తాడు.

ఆ శిల్పానికి ఎదురుగా మెట్లదారిలో ఒక రాతిగుండు మీద తెలుగు శాసనముంది. అది 18వ శతాబ్దపునాటిది. శాసనంలో పేర్కొన్నట్టు ఈ గుట్ట పేరు ‘వేంకటపతి కొండ’. గుడిలోని దేవుడు (తి)రుపతి ప్రసన్న వెంకటద్రిగా శాసనం చెప్తున్నది. ఈ శాసనం వికృతినామ సంవత్సర మాఘ శుద్ధ దశమి, గురువారం అంటే ఎఫిమెరిస్ ప్రకారం 1762 ఫిబ్రవరి 4వ తేదీన వేసినట్టు తెలుస్తున్నది. లక్ష్మికాంతయ్య లక్ష్మీకొమార కేశవయ్య (చం)ద్రయగారల వంశీకులు రామయగారు వేయించిన ధర్మశాసనం. 

మరిన్ని వార్తలు